అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు, సివిల్ పోలీసుల భద్రత నడుమ కౌంటింగ్ జరగనుంది.
అరుణాచల్ ప్రదేశ్ లో..
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10అసెంబ్లీ స్థానాల్లో ఏకగ్రీవంగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. 50 స్థానాలకు 133 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 66శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలాఉంటే.. ఓట్ల లెక్కింపుకోసం 24 కౌంటింగ్ కేంద్రాలను, 2వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. రేపు వెల్లడయ్యే ఫలితాలను బట్టి బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతుందా.. ప్రభుత్వం మారుతుందా అనేది స్పష్టత రానుంది. ఇక.. అరుణాచల్ ప్రదేశ్ లోని రెండు లోక్ సభ స్థానాలకు జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
సిక్కింలో..
సిక్కిం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. శనివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఇక్కడ 80శాతం పోలింగ్ నమోదైంది. 32 స్థానాలకు 146 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రస్తుతం సిక్కింలో అధికారం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది.