సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగిశాయి. ఈసారి బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవని పలు సర్వే సంస్థలు గట్టిగా చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గట్టిగా పుంజుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు జూన్ 1 శనివారం సాయంత్రం 3 గంటలకు సమావేశమవ్వాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో సాధారణ ఎన్నికల ప్రక్రియ, ప్రచార సరళి, ఓటింగ్ జరిగిన తీరు, కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన విధానం, అలాగే కౌంటింగ్ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇలా పలు ప్రధాన అంశాలపై చర్చించాలని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జూన్ 4న ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇండియా కూటమి ఎగ్జిట్ పోల్స్ పై మీడియాలో జరిగే చర్చలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ కీలక నేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సహా కూటమి నేతలంతా హాజరవుతారు. అయితే ఇలాంటి కీలక సమావేశానికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ రావడం లేదని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ లో ఏడవ విడత ఎన్నికలు 9 లోక్ సభ నియోజకవర్గాలలో జరుగుతున్నందున తాను ఈ సమావేశానికి హాజరవడం లేదని మమతా బెనర్జీ సమాచారం పంపినట్లు తెలిసింది. అయితే కీలక తరుణంలో మమతా డుమ్మా చర్చనీయాంశంగా మారింది. కారణం ఇండియా కూటమి తో పొత్తు పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన రాష్ట్రాలలోనే ఉంటుందని మమతా ప్రకటించడం, అలాగే అవసరాన్ని బట్టి ఇండియా కూటమికి ఏమేరకు తన మద్దతనేది ప్రకటిస్తాననడంతో ఆమె విషయమై కాంగ్రెస్ మద్దతుదారులు అనుమానంతో ఉన్నారు. ఇక ఎన్నికల పేరుతో కీలక బేటీకి మమతా గైర్హాజరు కావడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.