Mahanaadu-Logo-PNG-Large

కౌంటింగ్‌రోజు వేషాలు వేస్తే తాటతీస్తా…పల్నాడు ఎస్పీ మలికా మాస్ వార్నింగ్

ఓట్ల లెక్కింపు రోజు లా ఆండ్‌ ఆర్డర్‌కు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్‌ హెచ్చరించారు. ఇప్పటికే రావాల్సిన మంచి పేరు వచ్చిందని సటైర్లు వేశారు.
పల్నాడు జిల్లాలో  పోలింగ్ అనంతరం హింసపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో పోలీసుశాఖ పై తీవ్ర విమర్శలు తలెత్తాయి.  రాజకీయ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారని…బహిరంగంగా వార్నింగ్‌లు ఇస్తున్నా…ఊర్లపైపడిపోయి అరాచకం సృష్టిస్తున్నా పట్టించుకోకపోవడంతో రెచ్చిపోయిన అల్లరిమూకలు ఏకంగా పోలీసుల తలనే పగులగొట్టారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం సైతం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేయడంతో డీజీపీ….లేడీ సింగంగా పేరుగాంచిన మలికాగార్గ్‌ను ఎస్పీగా నియమించారు. పేరుకు తగ్గట్టుగానే ఆమె అల్లరి మూకలకు మాస్‌వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్‌ రోజు ఎవరైనా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాటతీస్తామని హెచ్చరించారు.
మలికా మాస్‌ వార్నింగ్..
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని పల్నాడు ఎస్పీ మలికాగార్గ్ హెచ్చరించారు. రాజకీయ నాయకులు లా అండ్‌ ఆర్డర్‌ను గౌరవించాలని…లేనిపక్షంలో ఏ పార్టీవారైనా చర్యలు తీసుకోవడం తప్పదని  ఆమె స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత కోసం పోలీసుశాఖ కృషి చేస్తోందని…దీనికి విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదన్నారు. పోలీసు అధికారులు తప్పుచేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా 150 సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగిందని ఆమె తెలిపారు. గొడవలు, ఘర్షణలకు పాల్పడే అవకాశం ఉన్న 1666 మందిని సైతం పోలీసుశాఖ గుర్తించందన్నారు. నిరంతరం ఆయా వ్యక్తులపైన నిఘా కొనసాగుతుందన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇప్పటికే 150కి పైగా కేసులు పెట్టామని…దర్యాప్తు అనంతరం ఇందులో నిందితులుగా ఉన్న వారిపై రౌడీషీట్లు తెరుస్తామన్నారు మల్లికా. బైండోవర్ కేసుల్లో ఉన్నవారు లక్ష నుంచి రెండు లక్షల వరకు స్థానిక తహసీల్దార్ వద్ద డిపాజిట్ చేయిస్తున్నామన్నారు. అలాంటి వారు ఏదైనా గొడవకు దిగితే డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కి తిరిగి ఇవ్వబోమన్నారు. జిల్లావ్యాప్తంగా కార్డన్  సెర్చ్‌ కొనసాగుతోందని….అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు….విడిగా పెట్రోలు కలిగి ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 700 మంది కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.