క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా మరో ఐదు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో మంగళవారం రాత్రి విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 9 మంది మృత్యువాతపడ్డారు.

9 మంది మృతి

29 మందికి గాయాలు

క్రివీరిహ్‌లో రష్యా క్షిపణి దాడిలో మరణించిన సహచరుడి మృతదేహాన్ని తరలిస్తున్న ఉక్రెయిన్‌ సైనికులు

కీవ్, బ్రస్సెల్స్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా మరో ఐదు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో మంగళవారం రాత్రి విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 9 మంది మృత్యువాతపడ్డారు. మరో 29 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన వాటిలో నాలుగు క్రూజ్‌ క్షిపణులు, ఒక కింఝల్‌ బాలిస్టిక్‌ క్షిపణి సహా 24 షహీద్‌ డ్రోన్లను తాము నేలకూల్చినట్లు తెలిపారు. తమ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి ఉక్రెయిన్‌కు నిధులు సమకూర్చడంపై జీ-7 దేశాలు ఇటలీలో గురువారం చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు కోసం మార్గాలు అన్వేషించేందుకు స్విట్జర్లాండ్‌లో వచ్చే వారాంతంలో శాంతి సదస్సు జరగనుంది. దాదాపు 90 దేశాలు/సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో మాస్కో దాడుల ఉద్ధృతిని పెంచడం చర్చనీయాంశంగా మారింది.

నాటో మద్దతుకు హంగరీ అంగీకారం

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు నాటో మద్దతుగా నిలిచేందుకు హంగరీ అంగీకారం తెలిపింది. కూటమి ఆ దేశానికి అండగా నిలవకుండా తాము వీటో చేయబోమని స్పష్టం చేసింది. నాటో సెక్రటరీ జనరల్‌ స్టోల్తెన్‌బర్గ్‌ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌కు తాము సొంతంగా ఆర్థిక, సైనిక సాయమేదీ చేయబోమని హంగరీ తేల్చిచెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

సీఎస్‌టీవోను వీడనున్న అర్మేనియా

రష్యాతో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆ దేశ ఆధిపత్యమున్న ఉమ్మడి భద్రతా ఒప్పంద సంస్థ (సీఎస్‌టీవో) నుంచి వైదొలగనున్నట్లు అర్మేనియా ప్రకటించింది. ఎప్పట్లోగా దాన్నుంచి తప్పుకోవాలన్న దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి నికొల్‌ పశిన్యాన్‌ బుధవారం తెలిపారు. భద్రతా కూటమి అయిన సీఎస్‌టీవోలో ప్రస్తుతం రష్యా, ఆర్మేనియా, కజఖ్‌స్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, బెలారస్‌ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.

క్యూబా చేరుకున్న రష్యా యుద్ధనౌకలు

క్యూబాతో సంయుక్త మిలిటరీ విన్యాసాల్లో పాల్గొనేందుకు మూడు రష్యా యుద్ధనౌకలు బుధవారం ఆ దేశ జలాల్లోకి ప్రవేశించాయి. మాస్కోకు చెందిన ఓ అణు జలాంతర్గామి కూడా త్వరలోనే క్యూబాకు రానున్నట్లు తెలుస్తోంది. క్యూబాతో ఉమ్మడి విన్యాసాల అనంతరం రష్యా యుద్ధనౌకలు వెనెజువెలాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా సహా పలు పశ్చిమ దేశాల మద్దతు కొనసాగుతుండటంపై మాస్కో తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ పరిస్థితుల్లో తన బల ప్రదర్శన ప్రయత్నాల్లో భాగంగానే క్యూబాతో సంయుక్త మిలిటరీ విన్యాసాల్లో అది పాల్గొంటున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. వెనెజువెలా, క్యూబాలకు రష్యా దీర్ఘకాలంగా మిత్రదేశంగా ఉంది.