జూన్ 2 న కేజ్రీవాల్ లొంగుబాటు????

జూన్ 2 న కేజ్రీవాల్ లొంగుబాటు.. నన్ను మరింత వేధిస్తారు…అయినా తలవంచను
ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి జూన్ 2న లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఆన్ లైన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తనను లొంగతీసుకోవాలని జైల్లో ఎన్ని వేధింపులకు గురిచేసినా తలవంచనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఏమన్నారంటే…”జూన్ 2న నేను లొంగిపోవాలి. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరతా. అయితే ఈసారి వాళ్లు నన్ను మరింతగా వేధిస్తారు. “అయినా నేను తలవంచను” అని చెప్పారు. అయితే తాను జైలుకు వెళ్లినా ఢిల్లీ ప్రజలకు అందే అన్నిరకాల సేవలు యథాతథంగా అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. “ఈసారి ఎన్నిరోజులు జైల్లో ఉంటానో తెలియదు. దేశాన్ని నియంతృత్వం నుంచి రక్షించేందుకే జైలుకు వెళుతున్నాను. అందుకు గర్వంగా ఉంది. వారు నన్ను అణచివేయడానికి ప్రయత్నించారు. నాకు మందులు అందకుండా అడ్డుకున్నారు. అరెస్టు సమయంలో 70 కిలోలు ఉన్న నా బరువు ఇప్పుడు 62 కేజీలకు తగ్గింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బరువు పెరగలేదు. దీంతో కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఇది అంతర్గత అనారోగ్య పరిస్థితికి సంకేతం కావొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు” అని కేజీవాల్ వివరించారు. అయితే తన భార్య ఎంతో శక్తిమంతురాలని, జీవితంలోని ప్రతి కష్టంలోనూ తనకు ఆమె అండగా నిలిచారని ప్రస్తుతించారు. తాను జైలుకు తిరిగి వెళ్లిన తర్వాత ప్రజల గురించే ఎక్కువగా ఆలోచిస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు నెలకు రూ.1,000 చొప్పున ఇచ్చే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నేను ఒక కొడుకు లాగా మీకోసం పనిచేశాను. ఈరోజు మీ అందరినీ అభ్యర్ధిస్తున్నా..అనారోగ్యంతో ఉన్న నా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి…నా తల్లి గురించి ప్రార్ధించండి” అని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.