దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్నసార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడనుంది. నేడు చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నిలు జరగనున్నాయి. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 8, పశ్చిమ బెంగాల్‌లో 9, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 3, పంజాబ్‌లో 13, హిమాచల్‌ప్రదేశ్‌లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మీర్జాపూర్ నుంచి అప్నాదళ్ (సోనీలాల్) అధినేత్రి, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలపై గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ సిటింగ్ ఎంపీ రవికిషన్ ఈ దశలో బరిలో ఉన్నారు.
వారణాసి నుంచి రెండుసార్లు విజయం సాధించిన మోదీకి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్ గట్టిపోటీనే ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 స్థానాల్లో 8 గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి అంతకుమించి గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఉంది. బీహార్ రాజధాని పాట్నా, నలందా, పాటలీపుత్ర, అర్హా, ససారామ్, బక్సర్ వంటి స్థానాల్లో కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆర్కే సింగ్ బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాల్లోనూ గెలిచిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది.