నేనేం తప్పు చేయలేదు.. సిట్ ప్రశ్నలను తప్పించుకుంటున్న ప్రజ్వల్ రేవణ్ణ

సెక్స్ స్కాండల్ కేసులో జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నేతృత్వంలో అతన్ని విచారిస్తున్నారు. 6 రోజుల కస్టడీకి తీసుకున్న సిట్.. ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని.. వరుసగా రెండు రోజుల పాటు సిట్‌ ప్రశ్నలకు రేవణ్ణ తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని మీడియా వర్గాలు తెలిపాయి. ఈ కేసు తనపై కుట్రతో జరిగిందని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రజ్వల్ రేవణ్ణ చెబుతున్నారు. దీంతో ఈరోజు లేదా రేపు క్రైమ్ స్పాట్‌లో స్పాట్ ఇంక్వెస్ట్ నిర్వహించాలని సిట్ యోచిస్తోంది. అందుకోసం హాసన్ జిల్లా హోలెనర్సిపురానికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ అజ్ఞాతంలోకి వెళ్లింది. ప్రజ్వల్ రేవణ్ణ లైంగికదాడికి సంబంధించి విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసును తప్పించుకుని భవానీ రేవణ్ణ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తన భర్త జెడి(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ, తన కుమారుడితో సంబంధం ఉన్న కిడ్నాప్ కేసులో కూడా నిందితుడిగా ఉన్న భవానీ రేవన్న.. తాను సహకరిస్తానని, హోలెనర్సిపురలోని తన నివాసంలో ప్రశ్నించవచ్చని మొదట విచారణ బృందానికి లేఖ రాశారు. ఈ క్రమంలో.. భవానీ రేవణ్ణ నివాసానికి వచ్చిన సిట్ బృందం ఆమె కోసం ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో.. సాయంత్రం వరకు వేచి చూసి వెళ్లిపోయారు.

భవానీ రేవణ్ణ సిట్‌కు సహకరించకపోవడం వల్ల ఆమె న్యాయపరమైన ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కిడ్నాప్ కేసులో అరెస్టు నుండి ముందస్తు బెయిల్ కోసం ఆమె ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో వేసిన దరఖాస్తును కొట్టివేయడంతో సిట్ నోటీసు జారీ చేసింది. కాగా.. సిట్ విచారణ నుంచి భవానీ రేవణ్ణ తప్పించుకోగా.. ఆమెను అరెస్టు చేయాలని యోచిస్తోంది. భవానీ రేవణ్ణ ప్రస్తుతం అజ్ఞాత ప్రదేశంలో తలదాచుకున్నారని, ఆమె బంధువుల ఇంట్లో ఉండవచ్చని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.