పల్నాడులో కౌంటింగ్ పై ఎస్పీ మల్లికా గార్గ్ మరో సంచలన ప్రకటన

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కోరారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో సెంట్రల్ ఆర్మూడ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బలగాలతో మార్చ్ ఫాస్ట్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ.మాట్లాడుతూ ఎన్నికలవేళ పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న హింస కారణంగా భారీగా ప్రజల ఆస్తులు ధ్వంసం అయ్యాయని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అన్నారు. మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జూన్ 1 నుండి జూన్ 5 వ తారీఖు వరకు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కఠినంగా అమలుపరచనున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా రోడ్ షోలు నిర్వహించడం, బాణసంచా కాల్చడం వంటివి నిషేధించామని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పల్నాడు లో చెలరేగిన హింసని దృష్టిలో ఉంచుకొని వేల మంది బలగాలతో పల్నాడు ప్రాంతం మొత్తాన్ని డేగ కంటితో కాపలా కాస్తున్నామన్నారు. ఎవరైనా హింస ని ప్రేరేపిస్తే వారిపై వెంటనే పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల అల్లర్ల కారణంగా పల్నాడుకు దేశవ్యాప్తంగా చాలా చెడ్డ పేరు వచ్చిందని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూసి పల్నాడు గౌరవాన్ని నిలబెడతామని ఎస్పీ మల్లికా గార్గ్ చెప్పారు