Mahanaadu-Logo-PNG-Large

మీ చిత్తశుద్ది నిరూపించుకోండి… సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

రాష్ట్రంలో సీబీఐ రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ఇదే లేఖలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని లేఖలో బండి సంజయ్ కోరారు. అలాగే రాజ్యాంగంపై ప్రమాణంచేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్, కేటీఆర్ లు ఎమ్మెల్యే పదవుల్లో కొనసాగడానికి అనర్హులున్నారు. తెలంగాణ శాసనసభా నాయకుడి హోదాలో కేసీఆర్, కేటీఆర్ లను అనర్హులుగా ప్రకటించే విషయంపై స్పీకర్ కు లేఖ రాయాలని కోరారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలు వ్యవహారం ఏ విధంగా అటకెక్కిందో అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ జరగకుండా ఆపేసే కుట్రలు జరుగుతున్నాయని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు వ్యవహారాల్లో పారదర్శక విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని సంజయ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని సంజయ్ లేఖలో వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేరంమని, దీనిద్వారా ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సైతం కాలరాశారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలుసహా పలువురు సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, వారితో అవసరాలను తీర్చుకున్నారని ఇది దారుణ చర్యగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికాలో దాక్కుంటే ఎందుకు స్వదేశానికి రప్పించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలు నిగ్గు తేలాలంటే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ అవసరమని, అందువల్ల ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని మీరు కేంద్రానికి లేఖ రాయవలసిందిగా సిఎం రేవంత్ ని కోరారు. ప్రతిపక్షాలపై దారుణమైన కుట్రపన్ని సైబర్ దాడికి పాల్పడిన మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లపై సమగ్ర విచారణ జరిపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండంటూ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాసిన లేఖలో బండి సంజయ్ కోరారు.