సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం తన సతీమణి భారతితో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లారు. పదిహేను రోజుల విదేశీ పర్యటన అనంతరం శనివారం ఉదయం జగన్ దంపతులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం జగన్ దంపతులు తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
ఏపీలో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 17న సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో వారి పర్యటన సాగింది. 15రోజుల తరువాత తిరిగి వారు స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో వారికి ఘన స్వాగతం పలికారు. ఇదిలాఉంటే ఈనెల 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ లేదా రేపు పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.