హిమాచల్‌ అడవిలో చెలరేగిన మంటలు.. భారీ ఆస్తి నష్టం

హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని డింగు అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ సీజన్‌లో బిలాస్‌పూర్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అడవులు కాలిపోతున్నాయి. ఒక్క బిలాస్‌పూర్ జిల్లాలోనే బండ్ల, పర్నాలి, సిహ్రా, లోయర్ భటేడ్, కుడ్డి, బర్మానా, నయనదేవి, భరడి, ఘండిర్‌తో సహా పలు ప్రాంతాల్లోని అడవులు దగ్ధమయ్యాయి. రాజధాని సిమ్లా అడవులు కూడా దగ్ధమవుతున్నాయి. భారీ అగ్నిప్రమాదం కారణంగా.. ప్రపంచ వారసత్వ కల్కా-సిమ్లా రైల్వే మార్గంలో రైలు రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి. చాలా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు హిమాచల్‌లో వేల హెక్టార్ల విలువైన అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. పెద్ద సంఖ్యలో వన్యప్రాణులు, పక్షులు, ఇతర జీవులు కూడా మంటల కారణంగా మరణించాయి. నయనదేవిలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. అడవి మంటలను ఆర్పే ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.