
ఒక జాతీయ పార్టీ కన్నా మెరుగ్గా ఉన్నాయని గణాంకాలతో వివరించిన ప్రధాని మోదీ జీ!
– ఎంపీ విజయసాయిరెడ్డి
రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లోదేశంలోని ప్రాంతీయపక్షాలు చెప్పుకోదగిన విజయాలు సాధిస్తున్నాయి. ఇండియాలో అత్యధిక కాలం కేంద్ర ప్రభుత్వాలను నడిపి, రికార్డు స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో పోల్చితే స్టేట్ ఎలక్షన్లలో ప్రాంతీయ పార్టీలే ఇప్పటి వరకూ మెరుగైన పనితీరు ప్రదర్శించాయి. ఈ విషయాన్ని దేశంలో సుదీర్ఘకాలం ప్రభుత్వాన్ని నడిపిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు చెప్పలేదు. ప్రధాన మంత్రి, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నరేంద్ర మోదీయే స్వయంగా వెల్లడించారు.
గురువారం బీజేపీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ గణాంక వివరాలతో ప్రాంతీయపక్షాల ఎన్నికల విజయాల గురించి తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రధాని వెల్లడించిన వాస్తవాలు– ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే (తమిళనాడు), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ఆంధ్రప్రదేశ్), బిజూ జనతాదళ్ (ఒడిశా), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (పశ్చిమ బెంగాల్) వంటి పెద్ద ప్రాంతీయపక్షాలకు నిజంగా గర్వకారణం.
‘‘వివిధ రాష్ట్రాల్లో పాలకపక్షంగా కాంగ్రెస్ పార్టీ పోటీచేసిన 40 శాసనసభ ఎన్నికల్లో– ఈ పార్టీ కేవలం ఏడుసార్లు మాత్రమే విజయం సాధించింది. అంటే, అధికారపక్షంగా పోటీచేసిన కాంగ్రెస్ విజయాల శాతం 18 మాత్రమే. పలు రాష్ట్రాల్లో అధికార పక్షాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇది వరకు జరిగిన 36 అసెంబ్లీ ఎన్నికల్లో 18 సందర్భాల్లో విజయం సాధించాయి. అంటే, వాటి విజయాల రేటు 50 శాతం. మన పార్టీ బీజేపీ పాలక పార్టీ హోదాలో 39 శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగి 22 ఎన్నికల్లో గెలుపొందింది. బీజేపీ గెలుపు శాతం 56,’’ అని నరేంద్ర మోదీజీ తన పార్టీ ఎంపీల సమావేశంలో వివరించారు. ప్రధాని దేశంలో సుస్థిర పాలన అందిస్తున్న ప్రాంతీయపక్షాల ఎన్నికల గెలుపునకు సంబంధించి మరో ఆసక్తికర వాస్తవం కూడా వెల్లడించారు.
రెండుసార్లు అధికారంలో కొనసాగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సైతం….
పలు రాష్ట్రాల్లో వరుసగా రెండు పర్యాయాలు (దాదాపు పది సంవత్సరాలు) అధికారంలో కొనసాగిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రాంతీయపక్షాల పనితీరు ఒక జాతీయ పార్టీ కంటే మెరుగ్గానే ఉందని ప్రధాని మోదీ పై ప్రసంగంలో వెల్లడించిన గణాంక వివరాలు చెబుతున్నాయి. ‘రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత జరిగిన 17 అసెంబ్లీ ఎన్నికలకుగాను బీజేపీ పది సార్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒకసారి ఇలాంటి ఎన్నికల్లో విజయాన్ని నమోదు చేసుకుంది.
వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు రెండుసార్లు వరుసగా విజయాలు సాధించి పదేళ్లు పరిపాలించిన అనంతరం 15సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏడుసార్లు విజయం సాధించాయి,’ అని మోదీ జీ తన పార్టీ ఎంపీలకు చెప్పిన గణాంకాలు దేశంలో మంచి పరిపాలన అందించే ప్రాంతీయ రాజకీయపక్షాలకు ఆత్మవిశ్వాసాన్ని, మనో స్థయిర్యాన్ని పెంచుతాయి. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే దేశానికి తూర్పున బంగాళాఖాతం తీరాన ఉన్న అతిపెద్ద రాష్ట్రమైన (జనాభారీత్యా) పశ్చిమ బెంగాల్ లో 2011 నుంచీ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీఎంసీ) వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో (2011, 2016, 2021) తిరుగులేని విజయాలు సాధించి పుష్కర కాలానికి పైగా అధికారంలో కొనసాగుతోంది. ఏపీకి ఉత్తరాన సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాలో 2000 సంవత్సరం మార్చి నుంచి మరో ప్రాంతీయపక్షం బిజూ జనతాదళ్ (బీజేడీ) అధికారంలో నిరాటంకంగా కొనసాగుతోంది.
ఈ పార్టీ వరుసగా ఐదు శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. 2019 పార్లమెంటు ఎన్నికలతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఐదోసారి ఘన విజయం సాధించగా, అదే సమయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎలక్షన్లలో విశేష జనాకర్షణ శక్తిగల ప్రజా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కనీవినీ ఎరగని బ్రహ్మాండమైన ఘన విజయం సాధించింది.
గత నాలుగున్నరేళ్ల కాలానికి పైగా ఏపీలో ప్రజలకు సమర్ధ పాలన అందిస్తూ జనరంజక పరిపాలనలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది వైఎస్సార్సీపీ. ప్రజల శ్రేయస్సే సదా తన లక్ష్యంగా ముందుకు సాగే వైఎస్సార్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలకు అధికారంలోకి వచ్చాక జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాత్రమే ఉంటుందనడానికి ప్రధాని మోదీ గురువారం తన ప్రసంగంలో చెప్పిన వాస్తవాలు సాక్ష్యాధారాలుగా కనిపిస్తున్నాయి.