నేడు కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు..

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు జనసంద్రంగా మారింది. దీక్షకు హనుమాన్ మాలధారులు భారీగా తరలివస్తున్నారు. దీక్షాపరుల రాకతో కొండంతా రామ నామస్మరణతో మారుమోగుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు బందోబస్తును పెంచారు. కొండగట్టులో నేటి వరకు హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. దీక్షకు వచ్చే భక్తుల కోసం 300 మంది అర్చకులను, తలనీలాలు సమర్పించేందుకు 1500 మంది నాయీబ్రాహ్మణులను అధికారులు నియమించారు. 4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ నాలుగు ఉచిత బస్సులను నడుపుతోంది. భక్తులకు తాగునీరు, కూల్ షెల్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ తాగునీటి సమస్య, పారిశుధ్యం లోపించడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.