వైస్సార్ జిల్లాలో కరువు లేదా? ఒక్క కరువు మండలం లేదా? ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం?

-కేసీ కింద ఆరుతడి పంటలు వేసుకోమంటారు..నీరివ్వరు
-కుందూలో నీరున్నప్పుడు చెరువులు నింపరు.. ఇప్పుడు నీరు ఇవ్వాలనుకున్న ఇవ్వలేరు
-తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రెడ్యం సోదరులు

ఖాజీపేట: వైఎస్ఆర్ జిల్లాలో 36 మండలాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలం గా ప్రకటించకపోవడం ప్రభుత్వం అవగాహనతనానికి, రైతు వ్యతిరేకతకు ప్రత్యక్ష నిదర్శనం అని, అసలు జిల్లాలో కరువే లేదా? కరువు ప్రభుత్వానికి కనిపించదా? రైతాoగ అర్ధనాదాలు వినిపించడం లేదా? అని తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక మాజీ కార్యదర్శి, ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, తెదేపా సీనియర్ నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి లు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

ఖాజీపేట మండలం, దుంపలగట్టులోని రెడ్యం స్వగృహంలో రెడ్యం సోదరులు గురువారం విలేకరులతో మాట్లాడుతూ… జిల్లాలో 50.43% వర్షపాతం తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో ఒక్క మండలాన్ని అయినా కరువు మండలం గా ప్రకటించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్త పరిచారు. కేసీ ఆయకట్టు కింద ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ నీరెక్కడ అని వారు సూటిగా ప్రశ్నిస్తూ.. ఫైర్లు వేసుకోమంటారు, నీరివ్వరని వారు నిశితంగా విమర్శించారు.

కొండపేట, ఏటూరు, చాపాడు, మైదుకూరు కాలువల్లో నీరు ఎక్కడని వారు నిలదీశారు. దువ్వూరు మండలంలో అరకొరగా నీరు వచ్చినప్పటికీ ఉపకాలవల్లో కేవలం 1,2 కిలోమీటర్లు మాత్రమే నీరు వస్తుందని, మిగతా పైర్లకు నీరు అందడం లేదని వారు ఆవేదన చెందారు. ఆది నిమ్మాయపల్లి ఆనకట్టకు మైలవరం నుంచి నీరు చేరుతున్నప్పటికీ వాటి ద్వారా కేవలం 291 నుండి 306 కిలోమీటర్లు అంటే కేవలం 15 కిలోమీటర్లు మేరకు మాత్రమే కొంతవరకు నీరు వస్తోoదన్నారు.

కేసీ కాలువ కింద పాత కడప, చిన్నమాచ పల్లె, పాలంపల్లె చెరువులకు మాత్రమే నీరు వచ్చిందని, మిగతా పుల్లూరు, రావులపల్లె, దుoపలగట్టు, చెముళ్ల పల్లె, కొండపేట చెరువులతోపాటు మిగతా చెరువులకు ఒక చుక్క నీరు చేరలేదని వారు ఆందోళన వ్యక్తపరిచారు. వర్షాలు పడిన సమయంలో రాజోలి వద్ద కుందూ నదిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా తాము ఎస్.ఈ. రెడ్డి రాజశేఖర్ రెడ్డి కి, డిఈఈ బ్రహ్మానంద రెడ్డి దృష్టి తెచ్చినప్పటికీ వారు వైసీపీ నేతల ఒత్తిడితో వారు చెరువులకు నీరు ఇవ్వకుండా, చెరువులకు నీరు ఇస్తే నారుపోస్తారని కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నారని, నేడు నీరు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నా నీరు లేని కారణంగా నీరు ఇవ్వలేకపోతున్నారని వారు వివరించారు.

ప్రభుత్వం తక్షణం కరువు మండలాలపై పున: సమీక్షించి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, కరువు పనులు చేపట్టాలని, అధికార ప్రకటన మేరకు కేసీ కెనాల్ కింద ఆరుతడి పంటలకు చివరి అయికట్టు వరకు నీరు ఇవ్వాలని, కేసీ కింద చెరువులను నింపాలని, జిల్లా కలెక్టర్ తక్షణo ప్రభుత్వానికి నివేదిక పంపి కరువు మండలాలు గా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని రెడ్యం సోదరులు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో తెదేపా మండల నేతలు రెడ్యం నాగేశ్వర్ రెడ్డి, ఇండ్ల వెంకట్ రెడ్డి, మున్నెల్లి సుబ్బరాయుడు పాల్గొన్నారు.