జూన్ 2 న జరిగే తెలంగాణా ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకలకు సోనియా గాంధీ రాకపోవచ్చని తెలుస్తుంది. అనారోగ్యం, ఢిల్లీలో నెలకున్న అత్యధిక ఉష్ణోగ్రతల వాతావరణం కారణంగా సోనియా రాక అనుమానమే అంటూ కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో డాక్టర్ల సలహా మేరకు సోనియా గాంధీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్వయంగా వేడుకలకు రాకున్నా వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు తన సందేశాన్ని సోనియా వినిపించనున్నట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్ వేదికపై భారీ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా సిఎం రేవంత్ రెడ్డి సోనియా సందేశాన్ని ప్రజలకు వినిపించనున్నారు. సిఎం రేవంత్ రెడ్డి నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి తెలంగాణా ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా సోనియాను స్వయంగా ఆహ్వానించి వచ్చారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించి తన రాకపై హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ముందు షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం సోనియా గాంధీ హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆమె అనారోగ్యం కారణంగా ఈ యాత్రను రద్దు అయినట్లు తెలిసింది.