34 కేసుల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ దోషే: న్యూయార్క్‌ కోర్టు సంచలనాత్మక తీర్పు

అమెరికా అ‍ధ్యక్ష పీఠాన్ని మరోసారి అధిరోహించాలని తహతహలాడుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌నకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హష్ మనీ పేమెంట్స్‌ వ్యవహారంతో సహా 34 అభియోగాల్లో ఆయన్ను దోషిగా తేలుస్తూ న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ మేరకు ఆయనకు జులై 11న శిక్షను ఖరారు చేయనుంది. దీంతో ఇక ట్రంప్‌ జైలుకెళ్లక తప్పదా అనే ప్రశ్న సర్వత్రా ఉదయిస్తోంది. అయితే న్యూయార్క్ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు వల్ల ట్రంప్‌ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ కేసుల్లో ట్రంప్‌కు ఎంత శిక్ష పడుతుంది, ఆయన జైలుకు వెళితే ఎన్నికల్లో పోటీ చేయొచ్చా?..అనే అంశాలు ఇప్పుడు తెరమీదకు వచ్చాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఎదుర్కొంటున్న కేసుల్లో బిజినెస్‌ రికార్డులు తారుమారు చేయడమనేది న్యూయార్క్‌లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో శిక్ష విధింపు అనేది న్యాయమూర్తి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కేసుల్లో గరిష్ఠంగా శిక్ష నాలుగేళ్లు కాగా ఖచ్చితంగా జైలుశిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని న్యాయ నిపుణులు వివరిస్తున్నారు. జైలుశిక్షే విధించాల్సిన అవసరం లేదని, జరిమానా విధించి వదిలేయొచ్చని వారంటున్నారు. అయితే ఇంతకంటే తీవ్రమైన మరో 3 కేసుల్లోనూ ట్రంప్‌ అభియోగాలు ఎదుర్కొంటుండగా, అవి ఇప్పటికిప్పుడు ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ఆయన తరఫు న్యాయవాదులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా తాజా తీర్పుతో ట్రంప్‌ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఒకవేళ నేరారోపణలు రుజువైనా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలనే నిబంధన కూడా ఏమీలేదని అంటున్నారు. అందుకు నిదర్శనంగా 1920లో ఒక సోషలిస్ట్‌ నేత జైలు నుంచే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత ట్రంప్‌ మళ్లీ పై కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ కోర్టు తీర్పుపై ఘాటుగా ప్రతిస్పందించారు. అవినీతిపరుడైన ఒక వివాదాస్పద న్యాయమూర్తి తన కేసులు విచారణ జరిపారని ఆరోపించారు. ప్రజలు ఈ కుట్రలను నమ్మరని, నవంబర్‌ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను అమాయకుడిననే విషయం అందరికీ తెలుసని, దేశంకోసం, న్యాయంకోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.