తెలుగు చిత్ర సీమలో అజరామరంగా నిలిచిన అలనాటి మేటి పౌరాణిక చిత్రం భూ కైలాస్ మార్చి 20కి 66 వసంతాలు పూర్తి చేసుకుంది. నేటికీ అద్భుత చిత్ర రాజంగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయింది.
ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణి ముత్యాల్లో అజరామరంగా నిలిచిపోయిన పౌరాణిక చిత్రం 1958లో విడుదలైన ‘భూకైలాస్. అలనాటి తెలుగు సినీ అగ్ర కథానాయకులు అయిన ఎన్టీఆర్ ఏఎన్నార్, కథా నాయిక జమున, బి. సరోజా దేవి, ప్రతి నాయకుడు ఎస్వీ రంగారావు, వృద్ద పాత్రల సోషలిస్టు హేమలతల మేలు కలయికతో నిర్మితమైన పౌరాణిక చిత్ర రాజం న భూతో న భవిష్య తిగా నిలిచింది. భూకైలాస్ కథను 1958లో అదే ఏ.వి.యం. సంస్థ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మించింది. తెలుగు చిత్రంలో యన్.టి.రామారావు (రావణా సురుడు), అక్కినేని నాగేశ్వరరావు (నారదుడు), జమున (మండోదరి), ఎస్.వి.రంగారావు (మండోదరి తండ్రి), హేమలత (కైకేయి) ప్రధాన పాత్రలు పోషించగా కన్నడ చిత్రంలో రాజ్ కుమార్, కల్యాణ్ కుమార్, బి.సరోజాదేవి, నటించారు.
కన్నడ చిత్ర రంగంలో నటుడు, దర్శకుడుగా వినుతికెక్కిన ఆర్.నాగేంద్రరావు ఆ రోజుల్లో విజయ వంతంగా ప్రదర్శించిన నాటకం ‘భూకైలాస్’, దాని ఆధారంగా ఏ.విమెయ్యప్పన్ 1940లో తెలుగులో ‘భూకైలాస్’ చిత్రాన్ని నిర్మించారు. దానికి మరాఠీ కి చెందిన సుందరరావు నడకర్ణి దర్శకుడు, నిర్మాత తమిళుడు, నటీనటులు కన్నడకు చెందిన ఆర్.నాగేంద్రరావు, యం.వి. సుబ్బయ్య నాయుడు, లక్ష్మీబాయి ప్రధాన పాత్రధారులు. కథను అత్యంత రసవత్తరంగా తెరకు అనువదించారు దర్శకుడు కె.శంకర్. 1940 నాటి చిత్రానికి ఆర్.సుదర్శనం, ఆయనతో బాటు ఆర్.గోవర్ధనం కూడా కలిసి సంగీతా న్ని అందించారు. రావణుని కాలం నాటి సెట్స్ ను అందంగా తెరపై ఆవిష్కరించిన ఘనత కెమెరామన్ మాధవ్ కే దక్కుతుంది. 1958 నాటి రెండవ సినిమాలో రావణా సురుడుగా ఎన్.టి.రామారావు; నారదుడుగా అక్కినేని నాగేశ్వర రావు; మండోదరిగా జమున; మయాసురుడు (మండోదరి తండ్రి)గా ఎస్.వి.రంగారావు; కేకసి (రావణుని తల్లి)గా హేమ లత; పరమ శివుడుగా నాగ భూషణం; పార్వతీ దేవిగా బి.సరోజాదేవి; అద్భుత నటనా కౌశలాన్ని ప్రదర్శించారు.
సముద్రాల రాఘవాచార్య కథ, గీత, సంభాషణా రచయితగా చేసిన కృషి ఆయన ప్రతిభకు పరాకాష్టగా నిలిచింది. ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ అనే ఒక్క పాట తార్కాణంగా నిలుస్తుం ది. ఈ పాటలో రాముని అవతార వైశిష్ట్యాన్ని చూపించారు. ‘దేవదేవ ధవళాచల మందిర’, ‘జయజయ మహాదేవా’, ‘తగునా వరమీయా ఈ నీతి దూరునకు..’ వంటి పాటలు ఘంటసాల వెంకటేశ్వర రావు గళంలో జీవం పోసుకున్నాయి. ‘సుందరాంగా అందుకోరా’, ‘మున్నీట పవళించు నాగశయనా’ వంటి పాటలు కూడా ఆణి ముత్యాలే. ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్థనం కలసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మరపురాని మనోజ్ఞ దృశ్య కావ్యంగా మలచిన ఘనత దర్శకుడు కె.శంకర్‌కు దక్కుతుంది.
‘భూకైలాస్’ చిత్ర నిర్మాణం జరుగు తున్న సమయం లోనే ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ పుట్టువు నొందడం గుర్తుండే విషయం. సుందరాంగా అందుకోరా పాటలో అప్సరసగా ప్రత్యేక పాత్రలో హిందీ చలన చిత్ర తార హెలెన్ నృత్య ప్రదర్శన చేసింది. యన్.టి. రామారావుకు అభిమానం పెంచిన మొదటి చిత్రంగా ‘భూకైలాస్’ను పేర్కొనాలి. 20.3.1958న విడుద లైన ఈ చిత్రం ఉన్నత ప్రమాణా లతో కూడిన పౌరాణిక చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా రావణ బ్రహ్మ పాత్ర లో ఒదిగి పోయిన ఎన్టీయార్ ప్రతి నాయకు నిగా విశేష ప్రజాదరణ పొంది, రావణుడు అంటే ఇలా ఉంటాడని ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకుని, అభిమాన నటుడినిగా మారింది ఈ చిత్రం తోనే అనేది నూటికి నూరు పాళ్ళు నిజం.