– స్టార్ క్యాన్సర్ సెంటర్‌తో కలిసి చిరంజీవి ఛారిటబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్
– చిరంజీవి
హైదరాబాద్: రోజురోజుకు పెరిగిపోతున్న క్యాన్సర్ మహామ్మారి నుంచి తన అభిమానులు, సినీ కార్మికులను రక్షించేందుకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ముందడుగు వేశారు..స్టార్ క్యాన్సర్ సెంటర్‌తో కలిసి చిరంజీవి ఛారిటబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయనున్నట్లు చిరంజీవి ప్రకటించారు.
ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. 80 శాతం క్యాన్సర్లను ముందస్తుగా గుర్తిస్తే, చికిత్స చేయడం సులభమవుతుందని ఈ సందర్భంగా అన్నారు. జులై 9న హైదరాబాద్, జులై 16న వైజాగ్, జులై 23న కరీంనగర్‌లో రోజుకు వెయ్యి మంది చొప్పున వివిధ క్యాన్సర్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నట్లు చిరు వెల్లడించారు.
అభిమానులు, సినీ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత వైద్య పరీక్షలు చేయడమే కాదు, చికిత్సకు అయ్యే ఖర్చు విషయంలోనూ కొంత భరిస్తామని అన్నారు.
అయితే, ఎంత మొత్తం అనేది ఇప్పుడే చెప్పలేమని, మరొకసారి వైద్యులతో మాట్లాడి చెబుతానన్నారు. సినీ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని, దాని ద్వారా వాళ్లు భవిష్యత్‌లోనూ చికిత్సలు చేయించుకోవచ్చన్నారు.