నరకాసుర గోస!

తెలంగాణ చీకటి నుండి వెలుగులోకి రావాలి.. అజ్ఞానం నుండి జ్ఞానం లోకి రావాలని కోరుకుంటున్నాను. పుత్రులారా! బిడ్డలారా!! నేను నరకాసురుడిని. ఈ భూమి పుత్రుడిని మాట్లాడుతున్నాను. జరగబోవు అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ చీకటి నుండి వెలుగులోకి.. అజ్ఞానం నుండి జ్ఞానం లోకి రావాలని కోరుకుంటున్నా.

నా గురించి కొంత వివరణ..
నరకాసురుడు అంటే భూపాలుడు,భూమి పుత్రుడు అని అర్థం. నేను ఈ దేశపు చక్రవర్తిని యుగాల తరబడి ఈ దేశాన్ని పాలించాను,నా పాలనలో ప్రజలు చల్లగా ఉన్నారు సుఖ సంతోషాలతో వర్ధిల్లారు లక్షల సంవత్సరాలు పాలించాను ఆనాడు నన్ను జయించే రాజేలేడు. తల్లి చేతిలో తప్ప నాకు మరణం లేదు, నేను శత్రు రాజులతో మాత్రమే యుద్ధం చేశాను. కానీ నా ప్రజలతో కాదు. నా రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డలతో సమానంగా చూసుకున్నాను.

కానీ మీ పాలకులు వారి కుటుంబ సభ్యులకు కులపోల్లకు పదవులను రాజ్య సంపదను దోచి పట్టి.. ప్రజల మొఖాన ఉచిత పథకాల పేర ఎంగిలి మెతుకులు విసిరినట్లు.. నా రాజ్యంలోని ప్రజలకు విసర లేదు. అందరు ఉపాధి పొంది గౌరవంగా బ్రతికారు. నా రాజ్యంలోని ప్రజలను సారాకు బానిసలను చేయలేదు. కులాలుగా విభజించి కులానికో ఉచిత పథకం పెట్టలేదు.

మీ పాలకుల లాగా నేను వందల, వేల, లక్షల కోట్లు ప్రజా ధనాన్ని దోచుకో లేదు, వేల ఎకరాల భూమిని బినామీల పేర దాచుకో లేదు. ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో వేల ఎకరాలు, భవనాలు, హోటల్స్ కొనలేదు. మీ పాలకుల బ్రతుకులు యెట్లున్నవి? మీ బ్రతుకులు ఎట్లున్నవి? ఇప్పుడు చెప్పండి ఎవరు లోక కంఠకులు?

ప్రాజక్టులలో కమీసన్ లు కొట్టడం నాకు తెలుసా? నా పాలనలో సకల విద్యలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దోచుకొని దాచుకున్న వారిని ఓడించ డానికి ప్రయత్నం చేయండి. దీపావళి పండుగ మీ దుర్మార్గులైన పాలకులను, ఎన్నికలలో ఓడించి జరుపుకోండి. ఓట్ల కోసం వారు ఇచ్చే రూపాల కోసం.. లిక్కర్ కోసం ఆశ పడితే 5 సంవత్సరాలు గోస పడుతారు.

నోటుకు ఓటు అమ్ము కోకండి. ఓటుకు నోటు ఇస్తుండంటే వాడు దొంగ అని గుర్తించండి. వారు ఒక్క సారి మాత్రమే మిమ్ములను ఓటు అడు క్కుంటారు. 5 సంవత్సరాలు మిమ్ములను అడుక్కునే వారిని చేస్తారు. తెలంగాణ చీకటి నుండి వెలుగులోకి, అజ్ఞానం నుండి జ్ఞానం లోకి వచ్చి , ఉత్తమైన పాలకులను ఎన్ను కుంటారని కోరుకుంటూ… మీ నరకాసురుడు.

అవును మరిచి పోయాను. నన్ను స్త్రీ లోలుడు అని నింద వేస్తారు. మీ పాలకులు కూడా స్త్రీ లోలురే నపుంసకులు కారు. నేను రాక్షాసుడను కాను. మీ పాలకులే రాక్షసులు. వారిని మించిన రాక్షాసులు ఏ యుగంలో కూడా లేరు, మీ పాలకులు ధన పిశాచులు. వారి భాగస్వామ్యం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు ప్రభుత్వ భూములను , చెరువులను స్మశానాలను అప్పనంగా కట్టబెట్టారు. వాటిలో నిర్మాణాలు జరిగాయి. వేల కోట్లు సంపాదించారు. రాక్షాసులైన మీ పాలకులను ఓడించి, దీపావళి జరుపు కోవాలని కోరుకుంటూ….
మీ నరకాసూరుడు

– నారగొని ప్రవీణ్ కుమార్,
సామాజిక కార్యకర్త