కేసీఆర్-కేటీఆర్-హరీష్‌రావును ఓడిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ

– వారి నియోజకవర్గాలకు నిరుద్యోగ యువత తరలివెళ్లండి
– వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయండి
– ఆ ముగ్గురూ గెలిస్తే మళ్లీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు
– వారిని ఓడించేవరకూ యువత విశ్రమించవద్దు
– బీఆర్‌ఎస్‌కు బొందపెట్టేరోజులు దగ్గరకొచ్చాయి
– యువత ఆత్మహత్యలు చేసుకోవద్దు
– ఆత్మహత్యలతో తెలంగాణ చావుల పెంట
– ఆత్మహత్యలు ఆపండి ఆయుధమై లేవండి
– నిరుద్యోగుల చెరవట్టిన కె సి ఆర్, కె టి ఆర్, హరీష్ రావులను ఓడించడానికి నిరుద్యోగులు వేలాదిగా తరలండి
– త్యాగాలు మావి భోగాలు మీవా? ఇకపై చెల్లవు!

ఎన్నో ఆకాంక్షలతో, సబ్బండ వర్గాల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయమే జరిగింది. ముఖ్యంగా యువతకు తీరని అన్యాయం జరిగింది. ఉద్యోగాలు, ఉపాధి కల్పన కరువై బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడిన యువత, నేడు బూటకపు బంగారు తెలంగాణలో బలవంతపు చావులకు పాల్పడాల్సిన దుస్థితి దాపురించింది.

పోరాడిన శక్తులు చేయాల్సింది రాజకీయ మార్పు పోరాటం చేయాలి కానీ పిరికి చావులకు పాల్పడడం సరికాదు. నిరుద్యోగ యువత తమకు జరిగిన అన్యాయానికి తగు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. యువత ఆత్మహత్యలు ఆపి ఆయుధమై లేవాలి.

నిస్సహాయతను వదిలి, యువత అధోగతికి కారకులైన ఆ ముగ్గురి అధికారాన్ని కూల దోయడమే నిరుద్యోగుల పంతంగా మారాలి. అందుకోసం మరో తెలంగాణ ఉద్యమం లా యువత కదం తొక్కాలి. మేధావులు, బుద్ధి జీవులు, రాజనీతిజ్ఞులు, యువతకు అండగా నిలవాల్సిన అవసరముంది. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు, అధికారం ప్రధానమైన విషయాలు. ఇలాంటి ప్రధాన ఘట్టంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరముంది.

ఉద్యమ కాలంలో యువతను ఆత్మహత్యలకు ఉసిగొల్పి.. వారి బలిదానాలకు కారణమైన హరీష్ రావును, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అయిన కె టి ఆర్ ను, నమ్మించి మోసం చేసిన కె సి ఆర్ ను రాజకీయ సమాధి చేయడమే యువతరం పంతం కావాలి. రానున్న ఎన్నికల్లో చిత్తు, చిత్తుగా ఆ ముగ్గురిని ఓడించి, తెలంగాణను రక్షించుకోవడంలో యువత తమ తెగువను చూపించి, తెలంగాణ ప్రజల పోరాట పటిమను రుజువు పరచాలి. రాష్ట్రంలో ఉన్న బి ఆర్ ఎస్ మోసానికి గురైన నిరుద్యోగ యువత, ఆ ముగ్గురు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు తరలాలి. నిఖార్సైన ఉద్యమకారులను పక్కకు తప్పించి, వారిని అవమాన పరిచిన ,ఉద్యమకారులను ఉరికించి కొట్టిన వారికి, అధికార పీట వేసిన ఆ ముగ్గురిని అధికారానికి దూరం చేయడమే లక్ష్యం కావాలి.

పత్తి రైతుల ఆత్మహత్యలకు చలించిన మారోజు వీరన్న నాయకత్వంలో మొదలైన మలిదశ ఉద్యమం.. 1200 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు పెరగడమే కాకుండా, రైతుల చేతికి బేడీలు పడ్డాయి. రైతు ఆత్మహత్యలకు తోడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల, చిరు వ్యాపారుల, అసంఘటిత కార్మికుల ఆత్మహత్యలతో తెలంగాణ చావుల పెంట అయ్యింది.

వీటికి తోడు అసమాన విద్య, ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలతో , తెలంగాణ వల్లకాడుగా మారుతుంది. ఆత్మహత్యలు పెరిగి, ఆకలి చావులు, అనారోగ్య చావులకు కారణమవుతున్న ఆ ముగ్గురి పాలనను అంతమొందిచడమే యువత పంతం కావాలి. నియంత పాలనలో ఆర్ టి సి కార్మికుల చావులకు కారణమైన ఆ ముగ్గురిని, రాజకీయంగా ఓడించడమే లక్ష్యంగా కార్మికులు కదం తొక్కాలి.

ఒకనాడు తెలంగాణ కోసం బాగా పోరాటం చేస్తున్నానంటే అందరం నమ్మి .. రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన కె సి ఆర్ ను కరీంనగర్ ఎం పీ గా భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ సెంటిమెంట్ ను కాపాడుకున్నాము. కె సి ఆర్ గెలుపుకోసం ఆనాడు తెలంగాణ లోని పల్లె ప్రజలు పెద్ద ఎత్తున కరీంనగర్ కదిలి, కెసిఆర్ ను గెలిపించి తెలంగాణ సెంటిమెంట్ ను కాపాడుకొని తెలంగాణ ఉద్యమ బలోపేతానికి కృషి చేశారు. ఆ తర్వాత కె సి ఆర్ టీమ్ ఎన్నిసార్లు రాజీనామాలు చేసిన కూడా, ప్రజలు గెలిపించి తెలంగాణ పరువు కాపాడారు.

ఆనాడు తెలంగాణ పరువు కోసం పోరాడిన ప్రజలు, నేడు ఆ తెలంగాణను దుష్ట పాలన నుండి కాపాడుకోవడం కోసం ఆ ముగ్గురిని ఓడించాల్సిన అవసరముంది. నిరుద్యోగ యువత వేలాదిగా వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు తరలి, వారిని ఓడించడం కోసం ఇంటింటి ప్రచారం చేయాలి. ఆ నియోజకవర్గ ప్రజల కాళ్ళు పట్టుకోనైన దుష్ట పాలనను అంతం చేయాలి.

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేట్టిన నాటి నుండి, అన్ని వర్గాల ప్రజలను చెరబట్టారు. ఉద్యమకారులను నిర్బంధించి నియంత పాలన కొనసాగించారు. ప్రలోభ పథకాలతో ప్రజలను బిక్షగాల్లను చేసి యువతకు తీరని అన్యాయం చేశారు. ఆ ముగ్గురు చేసిన మోసాలు చెప్పుకుంటూ పోతే రామాయణమంతా, వినుకుంటూ పోతే మహాభారతమంతా ఉంటాయి. అలాంటి ముగ్గురిని ప్రజలుగా, నిరుద్యోగులుగా చిత్తుగా ఓడించాల్సిన అవసరముంది.

చీమలు పెట్టిన పుట్టలో పాములు కాపురమున్నట్లు ప్రజల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో, ఆ నలుగురు రాజ్యమేలుతున్నారు. ఎన్నడూ బతుకమ్మ ఆడని కవితమ్మ, తెలంగాణ మట్టి బిడ్డలతో బతుకమ్మ నాటకమాడి ప్రజలను బురుడి కొట్టారు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా జరిగే సమయంలో కె సి ఆర్ ఆమరణ దీక్ష విరమింపజేయాలని అమెరికా నుండి లొల్లి చేసిన కె టి ఆర్.. మా నాన్నను చంపుతారా అని ఆనాటి ఉద్యమకారులను నానా చీవాట్లు పెట్టారు.

ప్రాణాలు తీసుకున్న 1200 మంది తెలంగాణ ప్రజల గురించి చేసింది ఏమి లేదు. తెలంగాణా కోసం జరిగే ఆత్మహత్యలు కూడ ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రజల ప్రాణాలకన్న అయ్య ప్రాణమే మిన్న అని బోధపడింది. అయినా తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడని మేధావులు, ఉద్యమకారులు అవమానాలు భరించి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. కె సి ఆర్ అలిగి ఫామ్ హౌస్ లో పడుకున్నా, బ్రతిమలాడి తీసుకొచ్చి గద్దెనెక్కించారు.

బలమైన సర్పం చలి చీమల చేత చిక్కి చచ్చినట్లు .. యువత, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, కర్షకుల చేతిలో చిక్కి ఆ ముగ్గురు మట్టి కరవాలసిందే. నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆపి ఆయుధమై లేవాలి. అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధాన్ని సరిగా వాడుకొని, టార్గెట్ మిస్ కాకుండా శత్రు సంహారం జరపాలి. తెలంగాణ ఉద్యమంలో యువత శవాలతో రాజకీయం చేసి, అధికారం వచ్చాక.. నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ ముగ్గురిని రాజకీయ సమాధి చేస్తేనే తెలంగాణ రక్షించబడుతుంది. లేదంటే తెలంగాణ వల్లకాడవుతుంది.

తెలంగాణలో అక్కడక్కడ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచినా పర్వాలేదు. కానీ ఆ ముగ్గురిని మాత్రం ఓడించే శపథం తీసుకోవాల్సిన అవసరముంది. రాజకీయమంటే కొనుగోలు అమ్మకాల మార్కెట్ గా మార్చి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఆ ముగ్గురిని రాజకీయంగా ఖూనీ చేస్తేనే, త్యాగాల తెలంగాణలో ప్రజలు రక్షించబడుతారు. ఆ ముగ్గురిలో ఏ ఒక్కరు గెలిచినా ఇంతకాలం అక్రమంగా సంపాదించిన డబ్బుతో , దళారీ పెట్టుబడి రాజకీయాలతో కొనుగోళ్లతో మరో ఐదేళ్లు ప్రజలను దగా చేస్తారు. ఇంతటి పెద్ద ప్రమాదాన్ని గుర్తించి బుద్ధి జీవులు, మేధావులు, విద్యార్థి యోధులు, కవులు, కళాకారులు నిరుద్యోగులకు, అభాగ్యులకు అండగా నిలిచి ఆ ముగ్గురి ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. ప్రజాస్వామ్యం కాపాడబడి తేనే రాజ్యాంగం రక్షించబడుతుంది. ప్రజాస్వామ్యం కాపాడబడి రాజ్యాంగ హక్కులు సామాన్య ప్రజలకు అందిననాడే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. ప్రజాస్వామ్య విలువలకు పచ్చి వ్యతిరేకి అయిన ఆ ముగ్గురిని ఓడిస్తేనే, ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. యువత బతుకుతుంది. దళారి మూటను మట్టి కరిపించేందుకు మరో పోరాటం చేయాలి.

యువత దండుగా కదలండి తెలంగాణను రక్షించండి.

 సాయిని నరేందర్
తెలంగాణ ఉద్యమకారుల వేదిక
– వెన్నపూజ పరశురాజ్
సామాజిక తెలంగాణ ఫ్రంట్
Cell: 9701916091, 9866765281