మహా నగరంలో …మకర సంక్రాంతి.
ద్వారానికి పచ్చని ప్లాస్టిక్ తోరణం.
సొంతూరికి పాడి పంటలకు సుదూరం.
వెల్లంకి వారి పిండి వంటలు.
పాత పత్రికల భోగి మంటలు.
ఇంట వస్తువులన్నీ వున్నా వంట చేసేవారు లేరు
పని వారు సంక్రాంతికి వారి ఊరికి వెళ్లి పోయారు.
ఒక్క నైవేద్యంతో ఒక్కపొద్దు సరిపెట్టుకున్నాం
సహాయం దొరకని వేళ సర్దుకు పోతున్నాం .
మామిడి ఆకులు ఎక్కడ వెతికినా కనపడలేదు
ఆవుపేడ కావాలంటే అమెజాన్ లో అగుపడలేదు.
గుమ్మడి పూల కోసం గుబులు వద్దనుకున్నాం.
బంతి పూల తోనే బయటి వాకిలి అలంకరించాం.
హరిదాసుల కీర్తనలు యూ ట్యూబ్ లో హాయిగా వింటున్నాం
గంగిరెద్దుల వారి ఆటలు టీవీలో ఘనంగా చూస్తున్నాం.
కోడి పందేలు పగటి కలల్లో కోలాహలంగా ఆడుతున్నాం.
గాలిపటాలను రంగు రంగుల గాలిమేడల్లో ఎగుర వేస్తున్నాం .
ఎడ్ల బండ్ల పోటీలు ఎక్కడ వెతికిన కనపడవాయె.
బండ లాగుడు ఆటలు మాకు ఎండ మావులాయె.
గోళీలాడుదామంటే గల్లీ మిత్రులు గతించి పోయె.
బొంగరాలాట ఆడుదామంటే తాడు తోడు లేదాయే.
పరికిణీలు కట్టిన యువతుల పలకరింపులు లేవు.
చెణుకులు వేసే బావమరిది చెరకు పలుకులు లేవు.
కొత్త బట్టలు పెట్టేందుకు అల్లుడు అమెరికా నుండి రాలేరు.
పాత బట్టలు ఇస్తామంటే గంగిరెద్దువారు గుమ్మానికి రారు.
తంపటి తేగలు తినాలని తెగ ఆరాట పడ్డాను.
బిగ్ బాస్కెట్ లో లేవని చెపితే నిరాశపడ్డాను.
జొమాటో వారి ద్వారా బెల్లం అరిసెలు తెచ్చుకున్నాం.
తీరిగ్గా తింటూ గతం, సంగతం నెమరు వేసుకున్నాం.
ఆనాడు ఎవరి భోగి మంట ఎంత ఎత్తో కొలిచే పరికరం లేదు.
అయినా పోటీ పడి మంటలు వేసే కుర్రాళ్ళ కు ఆ వేడి అడ్డు రాదు.
భోగి మంటల్లో సలసల కాగే నీళ్లు,గంగిరెద్దుల వారి చిరు సన్నాయి .
తంపటిలో కాలిన తేగలు, కుంపటిలో వేగిన అటుకులు గుర్తుకొస్తున్నాయి.
ఆరుబయట కాల్చే నేతి అరిసెల ఘుమ ఘుమలు,
అలుపూ సొలుపూ లేక పిండి దంచే అక్కల పకపకలు.
అమ్మా కబళం అంటూ అరిచే నిరుపేదల నివేదనలు.
అంతో ఇంతో అమ్మచేతి అన్నం,పప్పు నిప్పట్లు,చప్పట్లు.
ఆశలు పరిమితం ఆనాడు,
అవకాశాలు అపరిమితం ఈనాడు.
అయినా కనపడదు అంతటి ఆనందం.
ఆశలు మితంగా ఉంటే కలుగు పరమానందం.
డా .పి. కృష్ణయ్య
(విశ్రాంత ఐఏఎస్ అధికారి)