అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014 లో తెరకెక్కిన చిత్రం ‘మిణుగురులు’. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్ మరియు దీపక్ సరోజ్ నటించిన ఈ చిత్రం ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంర్భంగా అమెరికాలో స్పెషల్ షో వేయడం జరిగింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుండి ప్రశంసలందుకుంది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి, స్వర్గస్తులు దర్శకుడు – నిర్మాత దాసరి నారాయణ రావు, దర్శకుడు సుకుమార్, దర్శకుడు శేఖర్ కమ్ముల, పాటల రచయిత చంద్రబోస్ వంటి వారు ఈ చిత్రంలోని సామాజిక అంశాలని, సాంకేతిక విలువలని మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కృష్ణంశెట్టి మాట్లాడుతూ, “2014 లో చిత్రం విడుదలైనప్పుడు సోషల్ మీడియా పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలయ్యుంటే జాతీయ అంతర్జాతీయ మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా అందరి నోటా ఒకే మాటగా వెళ్ళేది. ఈ చిత్రంలోని సామాజిక విషయాలు పూర్తిగా పరిశోధించి, నిజ జీవితంలో చూపు లేని పిల్లల దయనీయ పరిస్థితిని చూపించటం జరిగింది. సరిగ్గా వారం కూడా ఆడని చిత్రాల మధ్య ‘మిణుగురులు’ 10 ఏళ్ళు నిలిచింది అని ఈ కార్యక్రమానికి వచ్చిన ఒక ప్రేక్షకుడు అన్నారు.