కింగ్ నాగార్జునకు చాలా గ్యాప్ తరువాత హిట్ దక్కింది. ఈ సారి సంక్రాంతి బరిలో నిలుచుని సక్కెస్ఫుల్లా బయటపడ్డాడు. నిర్మాతతో పాటు బయ్యర్లను ఈ చిత్రం సేఫ్ జోన్లోకి తీసుకొచ్చింది. కంటెంట్ పరంగా చూస్తే ‘నా సామిరంగ’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి కేవలం రిలీజ్ టైమింగ్, బాక్సాఫీస్ పరిస్థితులు కలిసొచ్చి ఆ మాత్రం విజయం సాధించిందని చెప్పవచ్చు. సంక్రాంతికి ప్రేక్షకులు రూరల్ డ్రామాలను చూసేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఆంధ్రా సినీ ప్రేక్షకులు, ఎక్కువగా కల్చరల్ సంస్కృతి సంప్రాదాయం కనిపించే చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సంక్రాంతి బరిలో నిలిచిన ‘గుంటూరు కారం’ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, ‘సైంధవ్’ డిజాస్టర్ కావడంతో నాగ్ మూవీకి
మరింతగా కలిసొచ్చాయి. అయితే ఏ మాటకి ఆ మాట గుంటూరు కారం కథ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. స్క్రీన్‌ప్లే.. త్రివిక్రమ్ పంచ్‌లకు కాస్త కామెడీ జనరేట్ అయినప్పటికీ ఎప్పటిలాగే పాత చింతకాయ పచ్చడిలా కథ ఉండడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండు చిత్రాలూ ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఉంటే ‘నా సామిరంగ’కు ఇబ్బంది అయ్యేదే. అంతే కాక సంక్రాంతికి కాకుండా వేరే సమయంలో ‘నా సామి రంగ’ రిలీజై ఉన్నా ఖచ్చితంగా తేడా కొట్టేసేది. ఎనిమిదేళ్ల కిందట ‘సోగ్గాడే చిన్నినాయన’తో ప్రేక్షకులకు మంచి వినోదం పంచిన నాగ్‌కు.. అది కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కానీ దీనికి కొనసాగింపుగా ‘బంగార్రాజు’ తీస్తే అందులో అంత ఎంటర్టైన్మెంట్ లేకపోయింది. అయినా సంక్రాంతికి రిలీజైంది కాబట్టి ఓ మోస్తరుగా ఆడింది. ‘నా సామిరంగ’ పరిస్థితి కూడా అంతే. ఈ రెండు చిత్రాల విషయంలోనూ జరిగింది ఏమంటంటే.. సంక్రాంతికి సూటయ్యేలా రూరల్ బ్యాక్ డ్రాప్ తీసుకుని.. కొన్ని ఆకర్షణలు జోడించి మమ అనిపించేశాడు నాగ్. ఈ సినిమాల్లో బలమైన కంటెంట్ ఉంటే నాగ్ మళ్లీ ‘సోగ్గాడే చిన్నినాయన’ స్థాయి సక్సెస్ అందుకునేవాడు. ఇలా రెండు సినిమాలు ఓ మోస్తరుగా ఆడేశాయి కానీ.. మళ్లీ ఇలాగే సంక్రాంతి మసాలా దట్టించి మమ అనిపిస్తే కష్టం. వచ్చే సంక్రాంతికి కూడా సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ‘నా సామిరంగ’ సక్సెస్ మీట్లో నాగ్ చెప్పాడు.