సినీ ప్రముఖులు అంటేనే ఒకింత ఇంట్రెస్ట్. ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఏం తింటారు, బిజినెస్ చేస్తారా.. ఎలాంటి డ్రెస్‌లు వేస్తారు, వారి పిల్లలు, కుటుంబం ఇలా ఏదైనా కొంత ఇష్టంగానే గమనిస్తారు. అయితే, సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం పెళ్లి పీటల మీదకు ఎక్కిన జంటలు కూడా చాలా ఉన్నాయి. ఒక దశలో వారి పెండ్లిళ్లు చాలా చర్చకు దారి తీశాయి. ప్రేమించి కూడా అభిమానులందరికీ సర్ ప్రైస్ ఇచ్చి తమ పెళ్లి చేసుకోవాలని భావించిన సినీ నటులు కూడా చాలా మందే ఉన్నారు. ఇందులో కొంతమంది ప్రేక్షకులకే కాదు అసలు ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్ గా ప్రేమ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు.
సావిత్రి పరిణయం
ఒకప్పుడు మకుటంలేని మహారాణిగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న మహానటి సావిత్రి జెమినీ గణేశన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.అప్పటికే ఓ పెళ్లి జరగడంతో పాటు ఆయనకు ఒక ఎఫైర్ కూడా ఉండటం గమనార్హం. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కెరీర్ మొత్తం నాశనం అయ్యింది. వీరిద్దరి ప్రేమ పెళ్లి ఒక దశలో సినీ ఇండస్ట్రీలోనే పెద్ద విషాందాంతం కూడా. కొంత కాలమే సవ్యంగా సాగిన వీరి సంసార జీవనం.. ఆ తర్వాత మొత్తం విషాద భరితమే. అయినప్పటికీ సినీ చరిత్రలో వీరి ప్రేమ పెళ్లి ఒక పెద్ద టాక్.
అతిలోక సుందరిగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి సైతం బోనీకపూర్ తో ప్రేమలో పడి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంది.దీంతో శ్రీదేవి బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకోవడం ఏంటి అందరూ అప్పట్లో అవాక్కయ్యారు కూడా. అంతకుముందు రాజశేఖర్, మురళీమోహన్, బాలీవుడ్ లో మిథున్ చక్రవర్తి లాంటి వాళ్ళతో శ్రీదేవి పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చాయి. కానీ, అందరికీ షాక్ ఇచ్చిన శ్రీదేవి.. బోనీ కపూర్‌తో ఏడడుగులు వేసింది.
బాలకృష్ణతో ముద్దుల మావయ్య సినిమా లో బాలయ్య చెల్లి గా నటించిన సీత సైతం తెలుగులో చాలా సినిమాలు చేసింది. సీతా ముందుగా పార్తిబన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోని తర్వాత విడాకులు ఇచ్చి 2010లో రెండో పెళ్లి చేసుకుంది. టాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీయ శరన్ సైతం రష్యాకు చెందిన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ కోస్కీవ్ ను పెళ్ళాడింది.
2003లో రమ్యకృష్ణ సైతం దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమ వివాహం చేసుకుంది. పవన్ కళ్యాణ్ సరసన సుస్వాగతం సినిమాలో నటించిన హీరోయిన్ దేవయాని సైతం దర్శకుడు రాజ్ కుమార్ ను ప్రేమ వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.
నాగార్జున, -అమల :
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ.. తన కోస్టార్ అమల ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నాగార్జునకు ఇది రెండో వివాహం కావటం గమనార్హం. వీరిద్దరూ రెండు సినిమాలలో కలిసి నటించారు. ఇదే సమయంలోనే ప్రేమలో పడి పెద్దల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు.
మహేష్ బాబు – నమ్రత :
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-, నమ్రతలది కూడా ప్రేమ వివాహమే. వీరిద్దరూ కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకుని ఇప్పటికీ తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
సూర్య– జ్యోతిక
టాలీవుడ్ స్టార్ హీరో సూర్య, సినీ నటి జ్యోతిక ఇద్దరిది కూడా ప్రేమ వివాహం. వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు. సూర్య, -జ్యోతికలు కుటుంబ సభ్యులకు తెలియకుండానే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత సూర్య తండ్రి వీరి ప్రేమ పెళ్లిని అంగీకరించి.. తిరిగి మరోసారి వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేశారు.
ప్రసన్న-స్నేహ :
తెలుగు హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్నేహ.. కోలీవుడ్ నటుడు ప్రసన్ తో కలిసి పలు తమిళ సినిమాలలో నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడటం.. అనంతరం ప్రజల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది.
అజిత్ – షాలిని :
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు అజిత్ ఒకరు. ఈయన వరుస సినిమాలలో నటిస్తే కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటి శాలినితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఇలా వీరిద్దరూ సినిమాలలో నటిస్తూనే ప్రేమలో పడటం.. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
యష్– -రాధిక :
కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా యష్ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ మూవీ ద్వారా రాఖీ బాయ్ గా గుర్తింపు పొందారు. ఇలా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఈయన తన సహ నటి రాధిక పండిట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత రాధిక సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
డైరెక్టర్స్‌తో ముద్దుగుమ్మల పరిణయం
ఒకే ఇండస్ట్రీకి చెందినవారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణం. అందులోనూ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు ప్రేమలో పడడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మామూలు విషయమే. నటులు తమ తోటి నటీమణులను వివాహం చేసుకోవడం అనేది చాలా సందర్భాలలో జరిగింది. అయితే, కథానాయికలను దర్శకులు ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఘటనలు మాత్రం కొంచెం తక్కువే అని చెప్పాలి. అలా డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.
రమా–రాజమౌళి
రాజమౌళి కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలకు రమా రాజమౌళి స్వయంగా కాస్ట్యూమ్ డిజైన్ చేస్తూ ఉన్నారు. నిజానికి వీరిద్దరిని ఇండస్ట్రీలో చాలామంది ఆదర్శ దంపతులుగా భావిస్తూ వారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ ఉంటారు. వాస్తవానికి రాజమౌళి, రమా రాజమౌళి ఇద్దరిదీ ప్రేమా వివాహం. అయితే వీరి ప్రేమ ఎలా మొదలైంది? ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్ళింది? అనే విషయాలు చాలామందికి తెలియదు. కానీ సినీ రంగంలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు తెలుసు. నిజానికి రాజమౌళిని వివాహం చేసుకోవడం కంటే ముందే రమకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. వారి దాంపత్యానికి గుర్తుగా కార్తికేయ కూడా జన్మించాడు. అయితే తర్వాత అభిప్రాయ భేదాలు రావడంతో రమ తన కుమారుడితో విడిగా జీవించడం మొదలు పెట్టింది. కీరవాణి రాజమౌళి ఇద్దరూ అన్నదమ్ముల కుమారులు, కీరవాణిని రాజమౌళి చాలా గౌరవిస్తూ ఇప్పటికీ తన ప్రతి సినిమాలో ఆయననే మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకుంటూ ఉంటారు. ఈ రమ కీరవాణి భార్య వల్లి సోదరి. దగ్గర బంధుత్వం ఉండడంతో రాజమౌళి, రమా ఇద్దరికీ సాధారణ పరిచయం ఏర్పడింది. రాజమౌళి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడుగా ఉంటూ శాంతినివాసం సీరియల్ దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా డైరెక్ట్ చేసే టైంకి ప్రేమ కూడా చిగురించింది. ఆమెకు అప్పటికే వివాహం అయ్యి ఒక కుమారుడు కూడా ఉన్నాడనే విషయం తెలిసిన రాజమౌళి ఆమెను వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకుని ఇంట్లో పెద్దలందరినీ ఒప్పించారు. అయితే సినీ కుటుంబం కావడంతో హడావుడిగా పెళ్లి చేసుకోకుండా చాలా సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా కార్తికేయను తన సొంత కుమారుడు కంటే ఎక్కువగా రాజమౌళి చూసుకుంటూ వచ్చారు. ఒకవేళ తమకు సంతానం కలిగితే కార్తికేయను సరిగా చూసుకో మేమో అనే ఉద్దేశంతో రాజమౌళి రమతో సంతానాన్ని కూడా కోరుకోలేదని చెబుతూ ఉంటారు. అయితే రాజమౌళి ఒకానొక సందర్భంలో ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని ఆమెను పెంచుతూ వస్తున్నారు.
రోజా , సెల్వమణి
సర్పయాగం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ రోజా. మెగాస్టార్ చిరంజీవి ముఠామేస్త్రి, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, శుభలగ్నం, అన్నమయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నారు రోజా. శంభో శివ శంభో, గోలీమార్, వీర, శ్రీరామరాజ్యం సినిమాల్లో కీలక పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన రోజా.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించారు. టీవీ షోలతో కూడా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారు. డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకునే సమయానికి సెల్వమణి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఒక సినిమా షూటింగ్లో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ప్రేమగా మారి బలపడింది. దాంతో వీరిద్దరూ 2002లో వివాహం చేసుకున్నారు.
రమ్యకృష్ణ – కృష్ణవంశీ
తెలుగు, తమిళంతోపాటు హిందీ సినిమాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. టాలీవుడ్లో దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించిన రమ్యకృష్ణ కెరీర్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆమె తన నటనతో అభిమానులను అలరిస్తున్నారు. అయితే, అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘చంద్రలేఖ’ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు. 1998 సంవత్సరంలో ‘చంద్రలేఖ’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత ఐదు సంవత్సరాలకు 2003 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు.
సుహాసిని– మణిరత్నం
1981 సంవత్సరంలో ‘కొత్త జీవితాలు’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు హీరోయిన్ సుహాసిని. తెలుగులో అందరు స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న సుహాసిని.. తన అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అభిమానులను అలరిస్తున్నారు సుహాసిని. క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నంను సుహాసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1988లో వీరిద్దరి వివాహం జరిగింది. సుహాసిని, మణిరత్నం కలిసి ఏ సినిమాకూ పని చేయలేదు. అయినా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
ఖుష్బూ– సుందర్
ఖుష్బూ.. తమిళంతోపాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి గ్లామర్ క్వీన్ అనే పేరు తెచ్చుకున్నారు. నటనలో కూడా తనకు తానే సాటి అని పలు సినిమాల ద్వారా నిరూపించుకున్నారు ఖుష్బూ. నటీనటులకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అయితే ఖుష్బూకు ఉన్న అభిమానులు ప్రత్యేకం. తొలిసారిగా ఒక హీరోయిన్‌కు గుడి కట్టారు ఖుష్బూ అభిమానులు. ప్రస్తుతం ఖుష్బూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ఇక, ఖుష్బూ తమిళ డైరెక్టర్ సుందర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూరై మురెన్ అనే తమిళ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ పెళ్లి వరకు దారితీసింది. 2000 సంవత్సరంలో ఖుష్బూ, సుందర్ పెళ్లి చేసుకున్నారు.
లిస్సీ– ప్రియదర్శన్
సుమన్ హీరోగా తెరకెక్కిన ఆత్మబంధం, 20వ శతాబ్దం సినిమాల్లో హీరోయిన్గా నటించారు మలయాళ నటి లిజీ. మలయాళంలో స్టార్ హీరోయిన్గా చాలాకాలం కొనసాగారు. తెలుగులో నాగార్జున, అమల హీరో,,హీరోయిన్లుగా తెరకెక్కిన ‘నిర్ణయం’, బాలకృష్ణ హీరోగా చేసిన ‘గాండీవం’ సినిమాలను డైరెక్ట్ చేశారు ప్రియదర్శన్. మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో సూపర్‌హిట్ సినిమాలను తెరకెక్కించిన ప్రియదర్శన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు లిజీ. 1990లో ప్రేమ పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2016 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ‘హలో’ సినిమాలో అక్కినేని అఖిల్ పక్కన, ‘చిత్రలహరి’ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన హీరోయిన్గా నటించిన ‘కల్యాణి ప్రియదర్శన్’ లిజీ, ప్రియదర్శన్‌ల కూతురే.
రాశి – శ్రీ ముని
పెళ్లిపందిరి సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది రాశి. కోడి రామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు హీరోగా నటించారు. ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, శుభాకాంక్షలు, దేవుళ్లు, నిజం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు రాశి. గిరిజా కల్యాణం, జానకి కలగనలేదు సీరియల్స్‌తో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాలు చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ శ్రీ మునిని పెళ్లి చేసుకున్నారు రాశి. 2005 సంవత్సరంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు రాశి. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తున్నారు.
ప్రీత – హరి గోపాలకృష్ణన్
‘రుక్మిణి’ సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగుపెట్టారు ప్రీత విజయ్ కుమార్. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ‘రుక్మిణి’ సినిమాలో వినీత్‌కు జోడీగా నటించి మంచిపేరు తెచ్చుకున్నారు ప్రీత. ఆ తర్వాత వైఫ్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, మా అన్నయ్య, ప్రియమైన నీకు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేశారు ప్రీత. ప్రీత కూడా డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక తమిళంలో స్టార్ హీరో సూర్యతో ఆరు, సింగం, సింగం 2, సింగం 3 వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ హరి గోపాలకృష్ణన్. 2002 సంవత్సరంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.
పూర్ణిమ – భాగ్యరాజా
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్‌హిట్ సినిమా ‘మంత్రి గారి వియ్యంకుడు’ సినిమాలో హీరోయిన్గా చేశారు పూర్ణిమ. తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ‘డార్లింగ్..డార్లింగ్..డార్లింగ్’ సినిమా షూటింగ్ సమయంలో పూర్ణిమ, భాగ్యరాజాల మధ్యా ప్రేమ మొదలైంది. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే స్టార్ డైరెక్టర్ భాగ్యరాజాను ప్రేమించారు పూర్ణిమ. స్టార్ డైరెక్టర్‌గా, యాక్టర్‌గా ఉన్న భాగ్యరాజాను పూర్ణిమ 1984 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. కాగా, పూర్ణిమ కూడా ఇటీవలే కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘నిను వీడని నీడను నేనే’ సినిమాలో హీరో సందీప్ కిషన్‌కు తల్లిగా నటించారు.
అమలాపాల్ – విజయ్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన ‘నాయక్’ సినిమాలో నటించారు అమలా పాల్. బెజవాడ, ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, పిట్ట కథలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అమలాపాల్. దైవ తిరుమగల్’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడ్డారు అమలాపాల్. 2014లో ప్రేమ పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు.
నయనతార – విఘ్నేష్ శివన్
చంద్రముఖి సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు నయనతార. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారామె. తన గ్లామర్, నటనతో అభిమానులను సైతం సంపాదించుకున్నారు నయన్. గజిని, లక్ష్మి, బాస్, దుబాయ్ శీను, తులసి, బిల్లా, అదుర్స్, శ్రీరామరాజ్యం, అమ్మోరు తల్లి, పెద్దన్న సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు నయనతార. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించారు నయనతార. పలు సినిమాలకు దర్శకత్వం వహించిన విఘ్నేష్ – నయనతార కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరూ 2022, జూన్ 9వ తేదీన వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
ఇక, ప్రధానంగా టాలీవుడ్లో ఇష్ట పడి చేసుకున్న పెళ్ళిళ్ళు అయిన మన హీరోలు ఎక్కువశాతం కులాంతర వివాహాలు చేసుకున్నారు. కులం కన్నా మతం కన్నా ప్రేమ గొప్పది అని నిరూపించారు.
టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని విమర్శలు ఉన్నప్పటికీ ఆయన చేసుకున్న రెండు పెళ్ళిళ్ళు కులాంతర వివాహాలే కాదు.. వేరే మతం.. వేరే దేశం కూడా. రేణు దేశాయ్ మరాటి అమ్మాయి కాగా, అన్నా లెజ్నేవా రష్యాకు చెందిన వారు. ప్రేమతో పేరుతో రెండు రాష్ట్రాలనే కాదు.. రెండు దేశాలనే ఏకం చేసిన హీరో మన పవర్ స్టార్.
అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నాడు. అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూతురు అయిన స్నేహ రెడ్డిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బన్నీ. వాళ్లిద్దరికీ ఆయన్ అనే కుమారుడు జన్మించాడు.
రామ్‌చరణ్ – ఉపాసనరెడ్డి
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ తన బాల్య స్నేహితురాలైన ఉపాసన రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె అయిన ఉపాసనా సైతం చెర్రీని ఇష్టపడటంతో అందరి ఆశీర్వాదాలతో వారి పెళ్లి ఘనంగా జరిగింది.
నాని – ఆంజనా
న్యాచురల్ స్టార్ నాని తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కాలంలో పరిచయం అయిన ఆంజనా మంచి స్నేహితులారుగా మారడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
మంచు విష్ణు – విరోనికా రెడ్డి
మంచు మనోజ్ హీరోగా ఢీ సినిమాకు కాస్ట్యూమ్ డిసైనర్ గా పనిచేసిన విరోనికా రెడ్డి మంచి విష్ణు ను ఇష్టపడటంతో అటు విష్ణు కూడా ఆమె అంటే ఇష్టం కలిగి ఉండడంతో ఇద్దరూ ఒకటి అవ్వాలి అని ఇంట్లో చెప్పారు. అయితే తొలుత మోహన్ బాబు ఒప్పుకొనప్పటికీ ఆ తరువాత దాసరి సర్ది చెప్పడంతో అంగరంగా వైభవంగా ఈ పెళ్లి చేశారు. వారికి ఇద్దరు కవల ఆడ పిల్లలు పుట్టారు.
మంచు మనోజ్ – ప్రణతి రెడ్డి
మంచు వారి రెండో కుమారుడు మనోజ్ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తన వదిన వీరోనికా ద్వారా పరిచయం అయితే ప్రణతిని తొలి చూపులోనే ప్రేమించి అందరినీ ఒప్పించి 2015లో పెద్దలు అందరి సాక్షిగా ప్రేమ వివాహం చేసుకున్నాడు మనోజ్.
శివబాలాజీ – మధుమిత
ఇంగ్లీష్ కరన్ అనే సినిమాలో కలసి నటిస్తున్న సమయంలో ఒకరిపై మరొకరు ఇష్టం పెంచుకున్నారు యాక్టర్స్ శివ బాలాజీ–మధుమిత. 2005లో వీరు ప్రేమలో పడగా2009లో ఇద్దరూ ఒకటయ్యారు. 2010లో వీరికి ధావిన్ అనే కుమారుడు జన్మించాడు.
రాజశేఖర్ – జీవిత
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తలంబ్రాలు సినిమా సమయంలో జీవితను ఇష్టపడటం, ఇద్దరికీ ప్రేమ కలగడం, ఆది పెళ్లి పీటలవరకూ వచ్చికలసి జీవిత ప్రయాణం సాగించడం జరిగింది. ఇక ఇద్దరూ ఒకటై, ఎన్నో సినిమాలు నిర్మించారు. వీరికి ఇద్దరూ కుమార్తెలు.
శ్రీకాంత్ – ఊహ
ఈవీవీ దర్శకత్వంలో శ్రీకాంత్, ఊహ కలసి నటించిన సమయంలో ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడటమే కాకుండా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆమె సినిమా తరువాత ఆయనగారు సినిమా చేసిన వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. ప్రస్తుతం వీరి కుమారుడు హీరోగా పరిచయం అయ్యాడు.
నాగ చైతన్య – సమంత
నాగ చైతన్య సమంత ప్రేమ జంట 2017లో గోవాలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6 మరియు 7తారీఖులలో హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాలలో వీరి పెళ్లి జరిగింది.
ప్రేమ.. పెళ్లి.. అయినా ఒంటరి
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఎక్కువై పోయాయి. అయితే వారిలో కొంతమంది ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవించడానికి వారి పెద్దలను ఒప్పించి ఆ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంటున్నారు. మరికొంతమందేమో ఆ ప్రేమ బంధాన్ని మధ్యలోనే వదిలేసుకుంటున్నారు. ఎన్నో కారణాల వల్ల తమ ప్రేమ బంధాన్ని మధ్యలోనే వదిలేసుకున్నారు.
సమంత
టాలీవుడ్ బ్యూటీ సామ్ హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. కానీ కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఏ మాయ చేసావే సినిమాలో తనతో కలిసి నటించిన నాగచైతన్య ని ప్రేమించి వివాహం చేసుకుంది. నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి రెండేండ్ల కిందట విడాకులతో వీడ్కోలు చెప్పింది.
రష్మిక
పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ రష్మిక తన కెరీర్ కోసం పెళ్లిని క్యాన్సల్ చేసుకుంది.
మెహ్రీన్
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. భవ్య బిస్నోయ్ అనే రాజకీయ నాయకుడితో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు.
నయనతార
నయనతార మొదట శింబుతో ప్రేమలో పడి కొన్ని రోజులకే బ్రేకప్ చేసేసింది. ఇక ఆ తరువాత కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. ఆ ప్రేమ పెళ్లి వరకూ వెళ్లకముందే అది క్యాన్సిల్ అయింది. ఇక ఆ తరువాత తమిళ్ డైరెక్టర్ అయిన విగ్నేష్ శివన్ ని ప్రేమించి ఇటీవలే వివాహం చేసుకుంది. అంతేకాకుండా సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయింది. అలా చివరికి ఈమె పెళ్లి చేసుకోగలిగింది.
త్రిష
టాలీవుడ్ హీరోయిన్ త్రిష తన మొదటి సినిమా హీరో అయిన శింబు తో ప్రేమలో పడింది. కొన్ని రోజులకి విరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం తో విడిపోయారు. ఆ తరువాత త్రిష ఒక తమిళ్ డైరెక్టర్ ని ప్రేమిచి ఎంగేజ్మెంట్ చేసుకుంది, కానీ అది పెళ్లి పెట్టాలవరకు రాకుండానే మధ్యలోనే ఆగిపోయింది.
శృతి హాసన్
హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయణం నడిపిన శృతి కొద్ది రోజుల తరువాత అతనికి బ్రేకప్ చెప్పింది. ఆపై ఇంకొక వ్యక్తిని ప్రేమించింది, కానీ అది కూడా నిలబడలేదు. ఇక ఇప్పుడు శాంతను హాజారికాతో కలిసి ఉంటుంది.