అయ్యో.. పాసులున్నా ప్రమాణస్వీకారం చూడలేకపోయామే!

చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి చూడాలనుకొని కడప నుంచి ఓ గుత్తేదారు కుటుంబసభ్యులతో వచ్చారు. విశ్వప్రయత్నాలు చేసి, మూడు వీవీఐపీ పాసులు సంపాదించారు.
డీజీపీ, ఎమ్మెల్యేలు కూడా నడిచి చేరుకోవాల్సిన పరిస్థితి

ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో సభా ప్రాంగణానికి ద్విచక్ర వాహనంపై వస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు

ఈనాడు, అమరావతి: చంద్రబాబు ప్రమాణస్వీకారాన్ని దగ్గరుండి చూడాలనుకొని కడప నుంచి ఓ గుత్తేదారు కుటుంబసభ్యులతో వచ్చారు. విశ్వప్రయత్నాలు చేసి, మూడు వీవీఐపీ పాసులు సంపాదించారు. మంగళవారం రాత్రి గుంటూరులోని హోటల్‌లో బస చేసి, బుధవారం ఉదయాన్నే కేసరపల్లి వద్ద ప్రమాణస్వీకార వేడుకకు బయలుదేరారు. కాజ టోల్‌ ప్లాజా వద్దకు వచ్చేసరికి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరోవైపు వేరొక వాహనంలో తన కుమారుడిని విజయవాడకు పంపి, మిత్రుడి దగ్గరున్న వీవీఐపీ పాస్‌లు తీసుకోమని చెప్పారు. అతని వాహనమూ వారధి సమీపంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. చివరకు ఆ గుత్తేదారు కుటుంబం ప్రమాణస్వీకార వేడుకకు చేరుకోలేక.. మధ్యాహ్నం తరువాత నిరాశగా వెనుదిరిగింది.

గుంటూరుకు చెందిన ఓ ప్రముఖుడు వీవీఐపీ పాస్‌తో ఉదయాన్నే కేసరపల్లి బయలుదేరితే.. జాతీయ రహదారిలో అనేకచోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆయన విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ దాటేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. చంద్రబాబు ప్రమాణస్వీకారం అయిపోవడంతో.. ఆ ప్రముఖుడు బెంజ్‌ సర్కిల్‌ నుంచే కారు వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. అత్యంత ప్రముఖులకు ఇచ్చే ట్రిపుల్‌ ఏ పాస్‌లు, వీవీఐపీ, వీఐపీ పాస్‌లతో గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద చంద్రబాబు, మంత్రివర్గ ప్రమాణస్వీకార వేడుకకు బయలుదేరినవారు ఎంతో మంది.. ట్రాఫిక్‌లో చిక్కుకొని గంటల తరబడి ఎటూ కదల్లేకపోయారు.

నడిచివెళ్లిన ఎమ్మెల్యేలు, పోలీస్‌ అధికారులు

కొందరు ఎమ్మెల్యేలు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో.. తమ వాహనాలు వదిలేసి నాలుగైదు, కిలోమీటర్లు నడిచి చేరుకున్నారు.

మరికొందరు ఎమ్మెల్యేలు.. వాహనాలను ట్రాఫిక్‌లోనే వదిలేసి, ద్విచక్రవాహనదారుల సాయంతో చేరుకోవాల్సి వచ్చింది.

డీజీపీ సైతం వేదికకు కొంత దూరంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో ఆయన నడిచి వెళ్లాల్సి వచ్చింది.

ఇతర జిల్లాల నుంచి వచ్చినవారు.. వాహనాలను రోడ్ల పక్కనే వదిలేసి నడుచుకుంటూనే.. వేదిక వద్దకు చేరుకున్నారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అనేక మంది చెట్ల కిందకు చేరి, సెల్‌ఫోన్లలో ప్రమాణస్వీకార ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.

ట్రాఫిక్‌ నియంత్రించడం, వాహనాల రద్దీని అంచనా వేయడంలో పోలీసులు విఫలం కావడంతో.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడాన్ని కళ్లారా చూడాలని వచ్చిన వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులకు నిరుత్సాహం తప్పలేదు.

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో దారిలో గుంటూరు జిల్లాకు చెందిన సత్యం అనే వ్యక్తిని లిఫ్ట్‌ అడిగి, ఆయన వాహనంపై ఇంటికి చేరుకున్నారు.