కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 49 మంది దుర్మరణం

ఎడారి దేశం కువైట్‌లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

మృతుల్లో 42 మంది భారతీయులే..

వారిలో 21 మంది కేరళ వాసులు

ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

రూ.2 లక్షల చొప్పున పరిహారం

అగ్నిప్రమాదం కారణంగా కువైట్‌లోని మంగాఫ్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు

కువైట్‌ సిటీ, దుబాయ్, దిల్లీ: ఎడారి దేశం కువైట్‌లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 42 మంది మన దేశానికి చెందినవారే. వారిలో కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌లకు చెందినవారున్నారు. చనిపోయిన వారిలో 21 మంది కేరళ వాసులే ఉన్నారని తెలిసింది. మిగిలిన మృతుల్లో పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్టు, నేపాల్‌ జాతీయులున్నారు. ప్రమాదంలో మరో 50 మందికిపైగా గాయాలపాలయ్యారు. కార్మికులంతా నిద్రలో ఉండగా వంట గదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం అంతా వ్యాపించాయి. దీంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయక నంబర్‌ను ఏర్పాటు చేసింది. బాధితుల కుటుంబ సభ్యులు +965 65505246 నంబరును సంప్రదించవచ్చు.

కువైట్‌లోని మంగాఫ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న అపార్ట్‌మెంట్‌

కువైట్‌లోని మంగాఫ్‌లో ఉన్న అల్‌-మంగాఫ్‌ అనే ఆరంతస్తుల భవనాన్ని ఎన్‌బీటీసీ అనే కంపెనీ అద్దెకు తీసుకుంది. అందులో 195 మంది కార్మికులు నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. కార్మికులంతా నిద్రలో ఉండగా బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతోపాటు పొగ దట్టంగా వ్యాపించడంతో ఊపిరాడక ఎక్కువ మంది మరణించారు. 6 గంటల సమయంలో సమాచారం అందుకుని వచ్చిన ఐదు అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయని కువైట్‌ అధికారులు తెలిపారు. సహాయక చర్యల సందర్భంగా ఫైర్‌ ఫైటర్స్‌ కొందరు గాయపడ్డారు. కువైట్‌ హోంశాఖ మంత్రి షేక్‌ ఫహద్‌ అల్‌-యూసుఫ్‌ అల్‌-సబా ఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల సంఖ్యను ధ్రువీకరించారు. భవనం యజమానితోపాటు, ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరణించిన వారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చనిపోయినవారు 20 నుంచి 50ఏళ్ల మధ్య వయసున్న వారని అధికారులు తెలిపారు.

గాయపడిన వారిలో 21 మందిని అల్‌-అదాన్, ఆరుగురిని ఫర్వానియా, ఒకరిని అల్‌-అమీరి, 11 మందిని ముబారక్‌ ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు.

గాయపడిన వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రులను కువైట్‌లోని భారత రాయబారి ఆదర్శ్‌ స్వైకా సందర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ఆసుపత్రుల్లో ఉన్న వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆ తరువాత ఆయన వెల్లడించారు.

ప్రధాని మోదీ ఆదేశాలతో విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ కువైట్‌కు బయలుదేరారు. ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.

కువైట్‌లో దాదాపు 9 లక్షల మంది భారతీయ కార్మికులు నివసిస్తున్నారు.

బాధ్యులపై చర్యలకు కువైట్‌ పాలకుడి ఆదేశం

అగ్ని ప్రమాదంపై దర్యాప్తునకు కువైట్‌ పాలకుడు షేక్‌ మెషాల్‌ అల్‌-అహ్మద్‌ అల్‌-జబేర్‌ అల్‌-సబా ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. యువరాజు షేక్‌ సబా ఖాలెద్‌ అల్‌-హమద్‌ అల్‌-సబా, ప్రధాని షేక్‌ అహ్మద్‌ అబ్దుల్లా అల్‌-అహ్మద్‌ అల్‌-సబాలు మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు మున్సిపల్‌ అధికారులను సస్పెండు చేశారు.