Varanasi: సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. జూన్ 18వ తేదీన వారణాసిలో జరిగే రైతుల సభలో ఆయన పాల్గొనున్నారు. ఆ క్రమంలో సమ్మాన్ నిధి నుంచి 17వ విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు. ఈ నిధుల వల్ల ఈ ప్రాంతంలో దాదాపు రెండున్నర లక్షల మందికి పైగా రైతులు లబ్ది పొందారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. కాశీ విశ్వనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అనంతరం స్థానిక దశాశ్వమేథ ఘాట్‌లో గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఈ మేరకు వారణాసి బీజేపీ జోన్ అధ్యక్షుడు దిలీప్ పాటిల్ వెల్లడించారు. సేవాపూరి అసెంబ్లీ పరిధిలోని మెహిందీగంజ్‌లో నిర్వహించే కిసాన్ సభలో మోదీ పాల్గొంటారని వివరించారు. అందులోభాగంగా రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారని తెలిపారు. అయితే నరేంద్ర మోదీ.. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన తొలిసారిగా వారణాసికి వస్తుండడంతో.. అందుకోసం పార్టీ.. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ.. వరుసగా మూడోసారి వారణాసి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజయ్ రాయ్‌పై లక్షన్నర ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన విషయం విధితమే