అందమే శోభనమై పుట్టిందేమో!

అందానికి పురుషరూపం..
నటనకు విశ్వరూపం..
మనిషేమో గ్లామర్
మనసేమో గ్రామర్…
ఏయెన్నార్..ఎన్టీఆర్
మహావిన్యాసాల పద్మవ్యూహంలో
దూసుకొచ్చిన వీరాభిమన్యు..
మహిళాలోకం వీరాభిమాన్
తెలుగు సినిమా హీమాన్!

అటూ ఇటూ హీరోయిన్లు..
నడుమ రేగిపోయే సోగ్గాడు..
శారద మెచ్చిన మానవుడు
మంచివాడైన దానవుడు
ఒకనాటి లవర్ బాయ్..
ఈ మంచి బాబాయ్
జన హృదయాల్లో ఖైదీబాబాయ్..

బాపూ సంపూర్ణరామాయణంలో
అందాలరాముడు..
అదే బాపు బుద్ధిమంతుడులో
అప్పుడప్పుడు
అక్కినేనికి మాత్రమే
కనిపించే కృష్ణుడు..
కురుక్షేత్రంలో మాత్రం
బొచ్చు కృష్ణుడు..
తెలుగింటి అందాల నటుడు..
ఈ నటభూషణుడు
మిత భాషణుడు..

ఎంతగా వివాదాలకు దూరమైనా
“జయ”పజయాలు
లలితంగా ఆయన
జీవితంలో ప్రధాన భాగాలు..
నట జీవితం..నిజ జీవితం
ఆయన మనసులో
విడిభాగాలు..
ఈ రెండూ శోభన్ దృష్టిలో
సమాంతర రేఖలు..
వాటిని వేరుగా ఉంచే
లాగించేశారు సినీ ప్రస్థానం
కొట్టేశారు అగ్రహీరోగా
సుస్థిర స్థానం..

అందానికి నిర్వచనం
ఈ శోభనాద్రి..
ఇంటి పేరు ఉప్పు..
మనిషి నిప్పు..
సొగసుగా అమరే మేకప్పు..
నుదుటిపై ఆ రింగు
ఆయనకే ఒప్పు..
పని విలువ ఎరిగిన శ్రామికుడు
భూమి విలువ
తెలిసిన దార్శనికుడు..
అందమైన నాయికల ప్రేమికుడు..
ఈ శోభన్ బాబు మహిళాలోకం
మెచ్చిన కథానాయకుడు..

తన అందంపై
అలవిమీరిన మక్కువ
రూపం మారినంతనే
తనకు తానే అయి లోకువ
ఈ తెరవేలుపు
తీసేసుకుని ఓ మలుపు
చెప్పేసి సినిమాలకు సెలవు
నాటి నుంచి మదరాసులోనే బ్రతుకుతెరువు..
ఇక ఏవండీ ఆవిడొచ్చింది
అనిపించుకోక ఇల్లాలి తోడిదే ప్ర”శాంత”నెలవు..
పిల్లల బొమ్మల కొలువు..
తోటి నటులంతా భాగ్యనగరికి
మార్చినా మకాం
చెన్నపట్నమే శోభన్
శాశ్వత డాట్ కాం..
పేరుకు ముందు డీసెన్సీ
చివర బీఎస్సీ…
క్రమం తప్పని క్రమశిక్షణే
శోభన్ బాబు లెగసీ..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286