ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై యువత ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
నిన్న, ఈరోజు చూస్తున్నాం.. సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. అవాంఛనీయమైన, అనారోగ్యకరమైన ఏ రకంగా కూడా ఆహ్వానించతగనటువంటి.. కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాను తీసుకొచ్చారు. ఏదైనా ప్రొగెషివ్ గవర్నమెంట్ ఉంటే ఇరిగేషన్, ఇండస్ట్రీయల్, ఎకనామిక్ ఫైల్స్ తీసుకురావాలి.
కశ్మీర్ ఫైల్స్ తో వచ్చేది లేదు. పోయేది లేదు. దీనిపై కశ్మీర్ పండిట్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ వీడియోలు తన దగ్గర ఉన్నాయి. ఈ రకమైనటువంటి దేశ విభజన, ప్రజల విభజన సరికాదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం దశాబ్దాల తరబడి ఉధృతంగా చేశాం. సకల జనుల సమ్మె అనే పిలుపునిచ్చాం. కానీ హిందువుల సమ్మె, క్రైస్తవుల సమ్మె, ముస్లింల సమ్మె అని పిలుపు ఇవ్వలేదని కేసీఆర్ గుర్తు చేశారు.
ఆ సినిమాను చూసేందుకు సెలవులు ఇచ్చారు..
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సెలువులు ఇచ్చి కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూడమన్నారు. ఈ దేశం ఎటు వైపు పోతోంది. ఇదేం విభజన రాజకీయం. ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఒక మంచి వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. దేశం నుంచి 5 లక్షల కోట్ల సాప్ట్ వేర్ ఎగుమతులు ఉన్నాయి. ఈ విభజన రాజకీయాల వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రభుత్వ అసమర్థత బయటపడింది. కరోనాను అరికట్టడంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది.
కోట్ల మందిని వేల కిలోమీటర్ల నడిపించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంది. కనీసం రైళ్లను కూడా కల్పించలేదు. అద్భుతమైన గంగా నదిలో వందల, వేల శవాలు తేలేటట్టు చేసింది ఈ ప్రభుత్వం. ఈ సత్యాలను దాచలేరని కేసీఆర్ పేర్కొన్నారు.