పోలీసులతోనే ‘దొంగా’ట!

-ఫొటో పంపి మరీ దొరికిన దొంగ

వీడెవరో రొటీన్‌కు భిన్నమైన దొంగలా ఉన్నాడండోయ్. నేరస్తులు దొంగతనం చేసి పారిపోతుంటే.. ఈ ఘరానాదొంగ మాత్రం, ‘సార్ నేను ఫలానా చోట ఉన్నా. ఆ ఇంటికి వచ్చి మంచి చాయ్ తాగి పోండి సార్’ అంటూ.. తనను గుర్తుపట్టేందుకు ఫొటో కూడా పంపిన ఈ టెక్నాలజీ కేడీ యవ్వారం చూడండి. మరి ఫొటో, లొకేషన్ కూడా పంపితే పోలీసులు గమ్మునుంటారా? లేదు కదా? ఆ కేడీకి బేడీలేసి తీసుకెళ్లారు.

టెక్నాలజీ సాయంతో ఖరీదైన కార్లను ఇట్టే కాజేసే ఘరానా దొంగ సత్యేంద్ర సింగ్ షెకావత్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు.గత కొన్నేళ్లుగా VIPలు,సెలబ్రిటీల కార్లను టార్గెట్ చేస్తూ సవాల్ గా మారిన సత్యేంద్రసింగ్ ను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. 2021లో హైదరాబాదులోని బంజారాహిల్స్ లో కన్నడ సినీ ప్రొడ్యూసర్ V.మంజునాథ్ కారు చోరీకి గురి కాగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

దర్యాప్తులో సత్యేంద్ర సింగ్ షెకావత్ ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు.ఇతడు తెలంగాణ,కర్ణాటక,గుజరాత్మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దాదాపు 60 కార్ల వరకు చోరీ చేశాడు. అయితే అతడిని పట్టుకోవడంలో పోలీసులకు పలు చిక్కులు ఎదురయ్యాయి.అతడి స్వస్థలం రాజస్థాన్ లోని జైపూర్ అని గుర్తించి అక్కడకి వెళ్లగా,అప్పటికే అతడు అక్కడి నుంచి ఉడాయించాడు. నమస్తే సార్… మీరు జైపూర్ వచ్చినట్టు తెలిసింది.నేనిప్పుడు బెంగళూరులో ఉన్నాను.ఎలాగూ మా ఇంటికి వచ్చారు కాబట్టి మా ఆవిడ మీకు రుచికరంగా వండి పెడుతుంది తినివెళ్లండి అంటూ వాట్సాప్ కాల్ చేసి పోలీసులనే కవ్వించాడు.

అంతేకాదు మీ టెక్నాలజీ కంటే ఐదేళ్లు ముందున్నా.మీరు నన్ను పట్టుకోలేరు కావాలంటే నా ఫొటో పంపిస్తున్నా చేతనైతే పట్టుకోండి అంటూ సత్యేంద్ర సింగ్ పోలీసులనే సవాల్ చేశాడు.ఎట్టకేలకు అనేక ప్రయత్నాల అనంతరం అతడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.అతడిపై హైదరాబాదులో పలు కేసులు ఉండడంతో PT వారెంట్ మీద బెంగళూరు నుంచి తీసుకువచ్చారు.