– రేప్ చేసి హత్య చేసిన కామాంధులు
– తిరుపతిలో బీ-ఫార్మసీ థర్డ్ ఇయర్ చేస్తున్న యువతి
– గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో ఘటన
– గోరంట్ల పీఎస్ ముందు యువతి మృతదేహంతో బంధువుల ధర్నా
‘‘ నా కూతురు ని గ్యాంగ్ రేప్ చేశారు… ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు చేశారు. పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయడం లేదు. తిరుపతి లో చదువుతున్న నా కూతుర్ని కారులో ఇక్కడికి తీసుకు వచ్చారు. రూమ్ లో బంధించి అత్యాచారం చేసి హతమార్చారు. తేజస్విని ఒంటి పై గాట్లు ఉన్నాయి… ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ ’’- తేజస్విని తల్లి నాగమణి.
ఆంధ్రప్రదేశ్ రాను రాను ‘కామాంధప్రదేశ్’గా మారుతోంది. వరస వెంట వరస.. గత పదిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులతో మహిళలు భీతిల్లిపోతున్నారు. రాష్ట్రానికి స్వయంగా మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ, మహిళాలోకానికి కనీసభద్రత కరవవుతున్న ఆందోళనకర పరిస్థితి. మొన్న విజయవాడ ప్రభుత్వాసుపత్రి, నిన్న రేపల్లె రైల్వే స్టేషన్, నేడు అనంతపురం.. రేపు? ఇదీ.. ఏపీలో మహిళల భద్రత.
మూడురోజులుగా మహిళలపై శరపరంపరగా జరుగుతున్న దాడులు, నాలుగోరోజూ కొనసాగాయి.తిరుపతిలో ఫార్మసీ చదివే ఓ విద్యార్ధినిపై ముగ్గురు నలుగురు మృగాళ్లు కలసి చేసిన సామూహిక హత్యాచారంతో, రాష్ట్రం మరోసారి ఉలిక్కిపడింది. ఈ ఘటన పోలీసుల వైఫల్యానికి పరాకాష్టగా నిలిచిందని టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు.
సత్యసాయిజిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనపై బీజేపీ విరుచుపడింది. బాధితురాలి కుటుంబంతో కలసి గోరంట్ల పోలీసుస్టేషన్ ఎదుట న్యాయం కోసం ధర్నా నిర్వంచారు. తన కుమార్తెను గ్యాంగ్ రేప్ చేశారని, అందుకు ఆమె ఒంటిపై ఉన్న గాట్లే సాక్షమని తల్లి భోరున విలపిస్తోంది. హంతకులను కఠినంగా శిక్షించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంపై బాధితురాలి కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రేమికుడే తమ కూతుర్ని హత్య చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తాజాగా జరిగిన ఘటనపై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేసి, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో పోలీసుల వైఫల్యానికి ఈ సంఘటన మరోసారి నిదర్శనంగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు ధ్వజమెత్తారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు రక్షణేదీ: యామినీశర్మ
ఏపీలో మహిళలకు కనీస రక్షణ లేదన్న వాస్తవం తాజా పాశవిక ఘటనతో తేలిపోయిందని బీజేపీ రాష్ట్ర నేత యామినీశర్మ విమర్శించారు. ‘‘ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు ప్రభుత్వం, పోలీసులు, మంత్రులు సిగ్గుతో దించుకోవాలి. సీఎం గారు ఈ ఘటనలను చిన్నవిగా చూపించి తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం సిగ్గుచేటు. విజయవాడలో, రేపల్లెలో ఏదో జరిగిపోయిదంటూ వ్యాఖ్యానించారంటే, ఆయనకు మహిళా రక్షణపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటన్నది స్పష్టమవుతోంది. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై శరపరంపరగా అత్యాచారాలు, హత్యలు జరగడం సిగ్గుచేటు. దీనికి నైతిక బాధ్యత వహించి హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాల’ని యామినీశర్మ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భారతీయ జనతా పార్టీనే అండగా నిలిచి, న్యాయం కోసం పోరాడిందని గుర్తు చేశారు.