-బెజవాడకు డ్రగ్స్ అలా వచ్చాయి..
-విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
బెజవాడలో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహరంలో అసలు నిజాలను పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆదార్ కార్డ్ ను ట్యాంపరింగ్ చేసి నిషేధిత పదార్థాలను తప్పుడు ధ్రువ పత్రాలు ఇచ్చి ఇతర దేశాలకు రవాణా చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. విజయవాడ భారతీ నగర్ DST Courier (International & Domestic Courier Service)లో ఓ పని చేస్తున్న గుత్తుల తేజ, అతను పని చేసే కొరియర్ సంస్థ ద్వారానే విజయవాడ నుండి ఆస్ట్రేలియాకు ఎఫిడ్రిన్ అనే నిషేధిత తెల్ల పౌడర్ ను పంపినట్లుగా బెంగుళూరు కస్టమ్స్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ మేరకు బెంగళూరు కస్టమ్స్ అధికారులు విజయవాడ పోలీస్ కమీషనర్ కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. వెంటనే విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన కొండవీడు గోపిసాయి విజయవాడ పటమట పోలీసులను ఆశ్రయించాడు. తన ఆధార్ కార్డ్ ను ఎవరో ట్యాంపరింగ్ చేసి తన పేరు మీద నిషేధిత తెల్ల పౌడర్ ను రవాణా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలియకుండా తన ఆధార్ కార్డుని ఉపయోగించిన వ్యక్తులపై చట్ట రీత్యా చర్యలను తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదుపై పటమట పోలీసులు క్రైమ్ నెంబర్ 03/2022 U/S 420,467,471 r/w 34 IPC కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆధార్ కార్డ్ ను దుర్వినియోగం చేసిన కేసు వెనుక ఉన్న సూత్రదారులను కూపీ లాగిన ఖాకీలకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పటమట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, సత్తెనపల్లి తదితర ప్రాంతాలలో దర్యాప్తు చేపట్టారు. గోపిసాయి చెన్నైలో చదువుకునే రోజుల్లో అక్కడ ఒక హోటల్ లో ఇచ్చిన తన ఆధార్ కార్డును చెన్నైకు చెందిన ఒక ముఠా సంపాదించింది. దానిలోని ఫోటో, డేట్ అఫ్ బర్త్ లలో మార్పులను చేసి సదరు తప్పుడు ధ్రువ పత్రాలతో, చెన్నైకు చెందిన కుప్పుస్వామి, అరుణాచలం, వెంకటేశం సహా మరో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ భారతినగర్ తోని DST Courier ద్వారా ఆ తప్పుడు ఆధార్ కార్డును ఉపయోగించి ఎఫిడ్రిన్ అనే నిషేధిత ఉత్ప్రేరక పదార్థాన్ని చీరల మాటున పెట్టి ఆస్ట్రేలియాకు కొరియర్ చేసినట్లుగా నిర్దారించారు.
ఈ దర్యాప్తులో భాగంగా 10.05.2022 తెల్లవారుజామున దుబాయి నుండి వస్తున్న నిందితుడు కుప్పుస్వామి, అరుణాచలం, వెంకటేశాన్ని చెన్నై ఎయిర్ పోర్టులో విజయవాడ పోలీసుల బృందం అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు. వీరి నుండి ఎటువంటి బిల్లులు టాక్స్ లు కట్టకుండా అక్రమంగా తరలిస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకు వస్తున్నట్లు విజయవాడ పోలీసులు తెలిపారు. అంతేకాదు సుమారు 25 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మేరి ప్రశాంతి తెలిపారు.