పెన్షన్ ఆఫీసుపై ఏసీబీ దాడులు

– పెన్షన్ ప్రాసెస్ చేయడానికి 27వేల లంచం డిమాండ్
– తొలి విడుత పదివేలు ఇచ్చిన మహిళ
– రెండో విడుత 10వేలు తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ ను రెడ్ హ్యాండెగ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

హైదరాబాద్:నాంపల్లిలోని పెన్షన్పేమెంట్ ఆఫీసర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు కార్యాలయంలో మాటు వేసిన అధికారులు సీనియర్ అకౌంటెంట్ ఆర్.వెంకట సత్యనాగ ప్రసాద్ 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోని అన్ని విభాగాల్లో సోదాలు చేపట్టారు. మరో బృందం అధికారులు అకౌంటెంట్ ప్రసాద్ ఇళ్లలో కూడా సోదాలు చేపట్టినట్లు సమాచారం.

ప్రభుత్వ టీచర్లు అయిన తన తల్లిదండ్రుల మరణం తరువాత వచ్చే బెనిఫిట్స్ కోసం 42 సంవత్సరాల మహిళ ఏడాది క్రితం దరఖాస్తు చేసింది. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. రేపు మాపు అని తిప్పుకుంటున్నారు.

విసిగిపోయి గట్టిగా ప్రశ్నించగా.. లంచం ఇస్తేనే ప్రాసెస్ చేస్తానని అకౌంటెంట్ ప్రసాద్ చెప్పారు. భారీ మొత్తం డిమాండ్ చేయగా.. బాధితురాలు అంత ఇచ్చుకోలేమని ప్రాథేయపడడంతో చివరకు 27వేలు ఇస్తే ప్రాసెస్ చేస్తానని అకౌంటెంట్ ప్రసాద్ స్పష్టం చేశారు. పెన్షన్ పేమెంట్ కార్యాలయం పనితీరుతో విసిగిపోయిన బాధితురాలు విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారిచ్చిన 10వేలు తీసుకుని ఇవాళ నేరుగా పెన్షన్ కార్యాలయానికి వచ్చింది. రెండో విడుత 10వేలు ఇవ్వగా సీనియర్ అకౌంటెంట్ ప్రసాద్ తీసుకున్నాడు. ఇంతలో ఏసీబీ అధికారులు వచ్చి లంచం తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.