శ్రీవారి ఆలయం వెనుక హత్య

– అలిపిరి వద్ద నిందితుడు అరెస్ట్
– మృతుడు తమిళనాడుకు చెందిన భాస్కర్‌

ఇది మున్నెన్నడూ వినిపించని వార్త. కోట్లాది వెంకన్న భక్తులను కలవరపరిచే వార్త. నిత్యం భక్తజనంతో కిటకిటలాడే తిరుమలలో హత్య జరిగింది. నిద్రిస్తున్న ఓ భక్తుడిని దారుణంగా హతమార్చిన వైనం భక్తలోకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎంతో భద్రత ఉండే తిరుమల కొండపై, ఈవిధంగా హత్య జరగడం అక్కడి భద్రతావ్యవస్థను వెక్కిరించింది. ఇప్పటివరకూ ఈవిధంగా తిరుమ కొండపై హత్య జరగడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి.

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమల కొండపై ఓ భక్తుడి హత్య కలకలంరేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం దగ్గర వ్యక్తి మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం ఓ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో హత్య జరిగినట్లు గుర్తించారు. సీనియర్ సిటిజన్స్ క్యూలైన్‌లో నిద్రిస్తున్న అనధికార హకర్ పై బండరాయి మోది హత్య చేశారు దుండగులు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సీసీటివి ఫుటేజ్ ఆధారంగా 2 గంటల వ్యవధిలో వన్ టౌన్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అలిపిరి వద్ద నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు తమిళనాడుకు చెందిన భాస్కర్‌గా గుర్తించారు. ఈ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. హత్యకు పాల్పడిన కందస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హకర్‌ను హత్య చేసిన చోరీలకు పాల్పడే వ్యక్తిగా గుర్తించారు.