– 2021 నేరాల గణాంకాలు విడుదల
దేశవ్యాప్తంగా నమోదైన పలు కేసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. సైబర్ నేరాలు, ఆహార కల్తీ వంటి కేసుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, ఆర్థిక నేరాల్లో రెండోస్థానంలో ఉంది. 2021లో నమోదైన కేసులకు సంబంధించిన గణాంకాలను జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసింది.2021లో రాష్ట్రంలో లక్షా 46 వేల 131 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి.2019లో 2,691, 2020లో 5,024 కేసులు నమోదు కాగా.. అంతకముందు ఏడాదితో పోలిస్తే 2021లో ఏకంగా 10,303కు కేసులు ఎగబాకాయి. దేశంలో 52,430 కేసులు నమోదు కాగా.. అందులో 20 శాతం తెలంగాణలోనే కావడం.. పెరుగుతున్న సైబర్ నేరాల తీవ్రతను తెలియజేస్తుంది.రెండోస్థానంలో ఉత్తర్ప్రదేశ్ 8,829గా ఉంది.
ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు 2,180 నమోదు కాగా.. ఓటీపీ మోసాలు 1,377, మార్ఫింగ్ 18, ఫేక్ ప్రొఫైల్ తయారీ 37, ఏటీఎం – 443 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. ఆర్థిక మోసాల కోణంలో జరిగే సైబర్ నేరాలు కూడా ఎక్కువగా తెలంగాణలోనే 8,690 కేసులు నమోదయ్యాయి. ఆర్థిక నేరాలు 2019లో 11,465, 2020లో 12,985 కాగా.. 2021లో ఏకంగా 20,759కి పెరిగాయి.దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో తెలంగాణ రెండోస్థానంలో ఉంది.
తెలంగాణలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నా అభియోగపత్రాల నమోదులో మాత్రం పోలీసులు వెనకబడే ఉన్నారు.ఈ విషయంలో దేశవ్యాప్త సగటు 33.6 శాతముంటే తెలంగాణది కేవలం 16.4 శాతమే.ఆర్థిక నేరాల్లో తెలంగాణ పోలీసులు 60.1 శాతం కేసుల్లో అభియోగపత్రాలు నమోదు చేశారు. వృద్ధులను ఫోర్జరీ తదితర పద్ధతుల్లో మోసగించిన కేసులు మహారాష్ట్రలో 1150 ఉండగా.. రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో 419 నమోదయ్యాయి. వృద్ధులను దొంగలు దోచుకున్న ఘటనలు మహారాష్ట్ర (1206) తర్వాత తెలంగాణలో (298)నే అధికంగా ఉన్నాయి. దోపిడీలు సైతం మహారాష్ట్రలో 13.. తెలంగాణలో 8 నమోదయ్యాయి.