-నెల్లూరులో జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు
– క్యాంటీన్లో సప్లయర్‌గా పని చేస్తున్న శివ హత్య చేసినట్లు వెల్లడి
నెల్లూరు నగరంలో మూడు రోజుల క్రితం హత్యకు గురైన దంపతుల కేసును.. పోలీసులు ఛేదించారు. కృష్ణారావు క్యాంటీన్లో సప్లయర్‌గా పని చేస్తున్న శివ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 28వ తేదీన నెల్లూరులోని అశోక్‌నగర్‌లోని వారి నివాసంలోనే.. వాసురెడ్డి కృష్ణారావు, అతని భార్య సునీత దారుణ హత్యకు గురయ్యారు.
దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. క్యాంటీన్లో అందరి ముందు మందలించారని.. శివ అనే వ్యక్తి కక్ష పెంచుకున్నట్లు గుర్తించారు. అతడే దంపతులిద్దరిని హత్య చేసినట్లు నెల్లూరు ఎస్పీ విజయరావు వెల్లడించారు.
నెల్లూరు నగరంలోని పడారుపల్లి సమీపంలోని అశోక్‌నగర్‌లో వాసిరెడ్డి కృష్ణారావు(54), సునీత(50) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ప్రేమ్‌చంద్, సాయిచంద్ ఉన్నారు. వారికి
వివాహాలు అయ్యాక వేర్వేరుగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు విశాఖపట్నంలోని పోస్టల్ శాఖలో ఉద్యోగి కాగా.. చిన్న కుమారుడు నెల్లూరులోని పొగతోటలో హోటల్ నడిపిస్తున్నారు. అశోక్‌నగర్‌లో కృష్ణారావు, సునీత మాత్రమే ఉంటున్నారు.
కృష్ణారావు స్థానికంగా కరెంట్ ఆఫీస్ సెంటరు వద్ద, శ్రీరామ్ పేరుతో క్యాటరింగ్, హోటల్ నడిపిస్తున్నారు. వీరిది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం. రోజూ కృష్ణారావు హోటల్ మూసేసి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తుండేవారు.. శనివారం రాత్రి కూడా భర్త వస్తారని సునీత బయట తలుపులకు తాళం వేయకుండా, పడక గదిలోకి వెళ్లి నిద్రపోయారు.
అప్పటికే రెక్కీ నిర్వహించిన దుండగులు.. ఇంట్లో మహిళ ఒక్కరే ఉన్నారని తెలుసుకుని లోనికి ప్రవేశించారు. పడక గదిలో నిద్రిస్తున్న సునీత తలపై కర్రతో మోదారు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.అనంతరం దుండగులు బంగారు ఆభరణాలు, నగల కోసం బీరువాలో అన్వేషించినా దొరకలేదు.
రెండు లాకర్లలో ఒక లాకరుకు మాత్రమే తాళాలు వేసి ఉంది. తాళాలు లేని లాకరులో హోటల్‌కు సంబంధించిన రోజు వారీ కౌంటరు నగదు ఉండేది. తాళం ఉన్న లాకరులో బంగారం పెట్టేవారు. బంగారం ఉన్న లాకరు ఎంతకీ రాకపోవడంతో దుండగులు వెనుదిరిగారు.
ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో వరండా దగ్గరే, దుండగులకు కృష్ణారావు ఎదురయ్యారు. వారిని చూసి దొంగలు అంటూ కేకలు పెట్టేలోపే , తమతో తెచ్చుకున్న కత్తితో దారుణంగా ఆయన గొంతు కోశారు. దాంతో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఆదివారం తెల్లవారుజామున పనిమనిషి ఇంటికి రాగానే దారుణాన్ని చూసి కృష్ణారావు బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నగర ఇన్‌ఛార్జి డీఎస్పీ అబ్దుల్ సుబహాన్, స్థానిక ఇన్స్పెక్టరు నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పరిశీలించారు.దోపిడీ ఎలా జరిగింది? హత్య ఎలా చేశారనే వివరాలు సేకరించారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి.అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు వాసిరెడ్డి సునీత.. తెదేపా సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు రాజకీయ కోణంలోనూ దర్యాప్తు చేయాలని స్థానిక తెదేపా నేతలు కోరారు. శవ పంచనామా నిర్వహించిన పోలీసులు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో.. ఘటనా స్ధలం సమీపంలో పడి ఉన్న కర్ర, కత్తితో పాటు.. మృతుడి సెల్ ఫోన్‌ను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.