అక్కడ ముగిసింది..మరి ఇక్కడ పరిస్థితి

నిన్న మొన్న‌టివ‌ర‌కూ మెగా ఫ్యామిలీ హీరోలంతా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్..వ‌రుణ్ తేజ్..సాయితేజ్..వైష్ణ‌వ్ తేజ్ ఇలా అంతా జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసారు. మెగాస్టార్ చిరంజీవి నేరుగా పిఠాపురం వ‌చ్చి ప్ర‌చారం చేయ‌లేదు గానీ త‌మ్ముడికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అలాగే కూట‌మి త‌రుపున పోటీ చేస్తోన్న వారంద‌ర్నీ గెలిపించాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వీడియోలు కూడా రిలీజ్ చేసారు. వీళ్లంద‌రికీ కాంట్రాస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వైకాపా ఎమ్మెల్యే అభ్య‌ర్ధికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. త‌న స్నేహితులు కావ‌డంతోనే పార్టీల‌తో సంబంధం లేకుండా త‌న స‌హ‌కారాన్ని అందించారు. ఇలా చేయ‌డంతో మెగా-అల్లు అభిమానుల మ‌ధ్య ఎలాంటి వైరం త‌లెత్తిందో తెలిసిందే. అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో పెద్ద యుద్ద‌మే జ‌రిగింది. అయితే ఇదంగా ముగిసిన గ‌తం. తాజాగా ఈ హీరోలంతా మ‌ళ్లీ మ్యాక‌ప్ లు వేసుకుని షూటింగ్ ల‌కు బ‌య‌ల్దేరారు. చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆర్సీ 16 కూడా వ‌చ్చే నెల నుంచి ప‌ట్టాలెక్కించ‌నున్న నేప‌థ్యంలో గేమ్ ఛేంజ‌ర్ త‌న పోర్ష‌న్ జూన్ క‌ల్లా పూర్తి చేయాల‌ని ముందుకు క‌దిలాడు. చిరంజీవి కూడా ఎన్నిక‌లు స‌హా ఎండ‌లు ఎక్కువ‌గా ఉండ‌టంతో ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు. ఆయ‌న కూడా విశ్వంభ‌ర షూట్ లో బిజీ అయ్యారు. సాయితేజ్..వైష్ణ‌వ్ తేజ్ ఇద్ద‌రు కొత్త ప్రాజెక్ట్ ప‌నుల్లో బిజీ అయ్యారు. వరుణ్ తేజ్ ‘మ‌ట్కా’ షూటింగ్ ని తిరిగి ప్రారంభించాడు. ఇక అల్లు అర్జున్ కూడా ‘పుష్ప‌-2’ షూట్లో బిజీ అయ్యాడు. ఈ సినిమా షూట్ కూడా డిలే అవ్వ‌డంతో వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ప‌రుగు మొద‌లు పెట్టాడు. ఇలా మెగా హీరోలంతా మ‌ళ్లీ బ్యాక్ టూ పెవిలియ‌న్ అనిపించారు. పొలిటిక‌ల్ వార్ కి ముగింపు ప‌లికి షూటింగ్ అనే కొత్త వార్ లోకి దిగారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు-ప్ర‌తివిమ‌ర్శ‌లు స‌హ‌జం. వాటిని సీరియ‌స్ గా తీసుకునే అవ‌కాశం లేదు. ఎందుకంటే సినిమా వేరు..రాజ‌కీయం వేరు అని ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌తీ ఒక్క‌రూ భావిస్తారు. అదే పాజిటివ్ ఎన‌ర్జీతో అంతా ముందుకెళ్తున్నారు.