పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు. నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు… పట్టుదలతో పోరాడి ఐపిఎస్ సాధించారు. నార్త్ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ‘ముంబయి సివంగి’ ఎన్.అంబిక విజయగాథ ఇది.
Ambhika IPS ,DCP Mumbai – పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు… ‘నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు… పట్టుదలతో పోరాడి ఐపిఎస్ సాధించారు. నార్త్ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ‘ముంబయి సివంగి’ ఎన్.అంబిక విజయగాథ ఇది.
‘పోలీస్ పరేడ్‌కి హాజరు కావాలంటూ ఆ రోజు ఉదయాన్నే నా భర్త ఇంటి నుంచి బయలుదేరారు. ఆ కార్యక్రమం టీవీలో చూశాను. డీజీపీ, ఐజీ హాజరయ్యారు. వారికి పోలీసులు నమస్కరిస్తూ చేసిన గౌరవమర్యాదలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. నా భర్త పోలీస్ కానిస్టేబుల్. ఆయన ఇంటికి రాగానే అడిగాను- ‘‘డీజీపీ, ఐజీ అంటే ఎవరు’’ అని. ‘‘వాళ్లు మా పోలీస్ డిపార్టుమెంట్‌లో మొదటి ర్యాంకు అధికారులు’’ అంటూ నా భర్త చెప్పారు. అప్పటి వరకూ ఇల్లు, పిల్లలే నా ప్రపంచం. ‘అప్పుడే నేను కూడా ఆ స్థాయి అధికారిణి కావాలని నిర్ణయించుకున్నా. అయితే అది అంత సులువు కాదని నాకు తెలుసు’’ అంటూ తనలో స్ఫూర్తి నింపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు అంబిక.
కళ్ళెదుట ఎన్నో అవరోధాలు: తమిళనాడుకు చెందిన అంబికకు 14 ఏళ్ళ వయసులోనే పెళ్లయింది. మేజర్ అయ్యేసరికి ఇద్దరు అమ్మాయిలకు (ఐగాన్, నిహారిక) తల్లి అయ్యారు. ఇంటి పనులు, పిల్లల ఆలనా పాలనా.. ఇదే ఆమె జీవితం. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారి కావాలని నిర్ణయం తీసుకున్నాక ఆలోచించుకుంటే ఆమెకు కళ్ళెదుట అనేక అవరోధాలు కనిపించాయి.
హైస్కూల్ దాటకుండానే పెళ్ళితో ఆమె చదువుకు ఫుల్‌స్టాప్ పడింది. పుస్తకాలకు దూరమై చాలా రోజులయింది. తన కల నెరవేరుతుందో? లేదో? అనే సందేహంలో ఉన్న ఆమెకు భర్త అండగా నిలిచారు. ఆమెతో ప్రైవేటుగా టెన్త్ రాయించారు. ఆ తరువత ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి, సివిల్స్ రాసేందుకు అర్హత సంపాదించారు.
నాలుగో ప్రయత్నంలో విజయం: ఆమె చెన్నైలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. పుస్తకాలు, నోట్స్, వార్తాపత్రికలు, మేగజైన్స్… ఇవే ప్రపంచం. అయితే మొదటి మూడు ప్రయత్నాల్లోనూ ఆమె విఫలమయ్యారు. అంబిక భర్త ‘‘ఇక ఇంటికి వచ్చెయ్’’ అన్నారు. ‘‘ఈ ఒక్కసారి ప్రయత్నిస్తా’’ అని ఆమె చెప్పారు. మరింత శ్రమించారు. 2008లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు.
అంబిక ప్రస్తుతం ముంబాయి నార్త్ డివిజన్ డీసీపీగా నియమితులయ్యారు. కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెగువ, దూకుడు చూసి అందరూ ఆమెను ‘ముంబాయి సివంగి’ అని పిలవడం మొదలెట్టారు. విధి నిర్వహణకు, సేవా తత్పరతకు గుర్తింపుగా ‘లోక్‌మత్ మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్- 2019’ పురస్కారాన్ని అందుకున్న అంబిక నేటి తరానికి ఆదర్శం.