-శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రజలకు అల్పాహారం వడ్డించారు. అనంతరం జనసేన నాయకులు బొర్రా అప్పారావు, మాజీ మునిసిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామిలతో కలిసి భోజనం చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పేద ప్రజల ఆకలి తీర్చడమే ఈ క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అవినీతిమయ ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారడం ఎంతో సంతోషకరమని అన్నారు. 2018లో ఎన్టీఆర్ పేరుతో ప్రారంభమైన అన్నా క్యాంటీన్‌లు, కేవలం రూ. 5కే పేద ప్రజల కడుపు నింపాయి.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 154 క్యాంటీన్లు ప్రారంభించి, 4.31 కోట్ల మందికి భోజనం అందించామని కన్నా గుర్తు చేశారు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీపడకుండా అక్షయపాత్ర సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, నాణ్యమైన భోజనం అందించామన్నారు. కానీ, గత వైసీపీ ప్రభుత్వం ఈ క్యాంటీన్లను రద్దు చేసి పేదల ఆకలి తీర్చే వనరును హరించిందని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఈ క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంలో చంద్రబాబు నాయుడు గారు కీలకపాత్ర వహించారని, 100 అన్నా క్యాంటీన్లను మొదటి విడతలో పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని, రూ. 5కే రుచికరమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.