-అభం శుభం తెలియని అమాయకపు పిల్లలపై కర్కశ చర్యలు
-వెట్టి చాకిరీ చేయిస్తూ లోకం తెలియని బాలికల పై భౌతిక దాడులు
-మతిస్థిమితం సరిగా లేని బాలికలపై లైగింక దాడులకు తెగబడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు
-ఇబ్రహీంపట్నం అన్నమ్మ దివ్యాంగుల పాఠశాల ఉదంతాలపై ఎన్టీ ఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కన్నెర్ర
-అర్ధరాత్రి మూడు గంటల వరకు కొనసాగిన ఆయా శాఖల అధికారుల విచారణ
-అధికారుల విచారణలో విద్యార్థులు విస్తుపోయే నిజాలు చెప్పినట్లు సమాచారం
ఇబ్రహీంపట్నం అన్నమ్మ పాఠశాల మూగ, చెవిటి, మతి స్థిమితం సరిగా లేని విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యను అందించడం ఆ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం..కానీ ఆ ఉన్నత లక్ష్యం కాస్తా గాడితప్పడం తో అక్కడ చదివే విద్యార్థులు నిత్య నరకం అనుభవిస్తున్నారు.. సంస్థ నిర్వాహకులు విద్యార్దిని విద్యార్దులతో వెట్టి చాకిరీ చేయిస్తూ, భౌతిక దాడులకు పాల్పడుతూ పిల్లల భవిష్యత్ తో చెలగాటం ఆడుతున్నారు.. బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించడంతో స్థానికులు ఆగ్రహం తో ఊగిపోయారు.. సంస్థ నిర్వహణపై పెద్ద ఎత్తున ఆరోపణలు, పిర్యాదులు వెల్లువెత్తడం తో చైల్డ్ లైన్ వెల్ఫేర్, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు.. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన అధికారుల సుదీర్ఘ విచారణ అనంతరం విద్యార్థులు, బాలికల నుండి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.. బాలికల పై లైంగిక దాడుల ఆరోపణల నేపథ్యంలో దిశ పోలీసులు బాలికలను విచారించారు.. పాఠశాల నిర్వహకురాలి భర్త పై ఆరోపణల నేపథ్యంలో ఆ కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. అక్కడ ఉన్న విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు తమను తీవ్రంగా కొడుతూ గాయపరుస్తున్నారని, వెట్టి చాకిరీ చేయిస్తూ నరకం చూపిస్తున్నట్లు మీడియా కు తమ ఆవేదన వెలిబుచ్చారు.. అభం శుభం తెలియని పిల్లలపై లోకం తెలియని బాలికలపై ఇలాంటి దుర్మార్గపు చర్యలు తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆగ్రహం తో ఊగిపోతున్నారు.. అధికారుల విచారణ అనంతరం బాలికలను చైల్డ్ వెల్ఫేర్ కు తరలించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్వాహకురాలి భర్తను అదుపు లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.