-మారేడుపల్లి ఎస్సైపై దొంగల దాడి
-కత్తితో కడుపులో పొడిచిన దొంగలు
-ఆసుపత్రిలో చేరిన ఎస్సై వినయ్ కుమార్
-నిందితులను దొంగలుగా గుర్తించిన పోలీసులు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మారేడుపల్లిలో విధి నిర్వహణలో ఉన్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను చిల్లర దొంగలు ఏకంగా కత్తితో పొడిచేసి పరారయ్యారు. సికింద్రాబాద్ పరిధిలోని మారేడుపల్లిలో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎస్సై వినయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన వివరాల్లోకెళితే… మంగళవారం రాత్రి మారేడుపల్లి పరిధిలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న వినయ్ కుమార్… అటుగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులను ఆపారు. వారి వివరాలు తెలుసుకునే యత్నం చేస్తుండగానే… ఆయనపై వారు కత్తితో కడుపులో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం అయిన వినయ్ కుమార్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే… ఎస్సైనే కత్తితో పొడిచి పరారైన నిందితుల కోసం పోలీసులు వేట మొదలెట్టారు. బుధవారం ఉదయానికే నిందితులను గుర్తించారు. లంగర్ హౌస్‌కు చెందిన పవన్, బాలాజీ నగర్‌కు చెందిన సంజయ్‌లుగా నిందితులను గుర్తించారు. వీరిద్దరిపైనా నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదైనట్లు తేలింది. ఎస్సైపై దాడి చేసిన వెంటనే నిందితులిద్దరూ పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.