-ఘటనపై విచారణ చేపట్టిన సైదాపురం పోలీసులు
నెల్లూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మనే దేశం పరువు అంతర్జాతీయంగా మట్టికొట్టుకుపోయింది. ఒక విదేశీ మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన సిగ్గుమాలిన తనానికి, ఏపీలోని నెల్లూరు జిల్లా వేదికయింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో గూండారాజ్ పాలన ఉందన్న ఆరోపణలకు తాజా అత్యాచారయత్న ఘటన ప్రపంచ దేశాల్లో భారతదేశం తలదించుకునేలా చేసింది. వైసీపీ సొంత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోందో మీడియా ముఖంగానే బట్టబయలు చేశారు. ఇక నెల్లూరు జిల్లాలో జరిగిన తాజా ఘటన, రాష్ట్రంలో దారితప్పిన శాంతిభద్రతలకు పరాకాష్టగా నిలిచిందన్న విమర్శలు సోషల్‌మీడియాలో వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున.. నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వచ్చిన ఓ విదేశీ యువతిపై.. అత్యాచార యత్నానికి ఒడిగట్టారు దుండగులు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకోగా.. దుండగులు పరారయ్యారు.
బ్రిటన్కి చెందిన యువతి.. కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వచ్చింది. ఈ క్రమంలో సైదాపురం సమీపంలోని రాపూరు రోడ్డు.. ఆ యువతిపై ఓ క్యాబ్ డ్రైవర్ తో పాటు మరొకరు అత్యాచారానికి యత్నించారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. విచారణ నిమిత్తం బాధితురాలిని.. సైదాపురం నుంచి గూడూరుకు తీసుకెళ్లారు.విదేశీ యువతిపై అత్యాచారయత్నం జరగడం రాష్ట్రానికే కాదు, దేశానికే తలవంపులు.
మహిళా దినోత్సవం నాడు ఇలా జరగడం సిగ్గుచేటు: చంద్రబాబు
నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిపై అత్యాచారయత్నం జరగడం రాష్ట్రానికే కాదు, దేశానికే తలవంపులు తెచ్చే దారుణం. అందునా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇలా జరగడం మరీ సిగ్గుచేటు. తెలుగుదేశం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.