ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం చేయాలి

– సైబర్ క్రైం పోలీసు ఉన్నతాధికారులకు ‘మహిళా కమిషన్’ లేఖ
– సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యపై ‘వాసిరెడ్డి పద్మ ‘ ఆరా
– సమగ్ర దర్యాప్తుతో నివేదికకు ఆదేశం

ఆన్ లైన్ మోసాలు, రుణాల యాప్ ల దురాగతాలపై మహిళలు, బాలికలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైం పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. ఆన్‍లైన్ మోసం నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో చెరువులో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని జాస్తి శ్వేతాచౌదరి ఆత్మహత్యపై సోమవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. ఘటనపై నందిగామా డీఎస్పీ, చిలకల్లు ఎస్సైతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి తండ్రిని వాసిరెడ్డి పద్మ ఫోన్ లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతురాలి స్వగ్రామం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపాన నవులూరు కావడంతో గుంటూరు ఎస్పీకి, ఘటనాస్థలి దర్యాప్తు నివేదికకు ఎన్టీఆర్ జిల్లా ఎస్పీతో పాటు సైబర్ క్రైం పోలీసు ఉన్నతాధికారులకు లేఖ పంపారు. శ్వేతాచౌదరి ఆత్మహత్య కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించామని, సమగ్ర దర్యాప్తుతో నివేదికలు పంపాలని లేఖలో కోరారు.