నటనే ఘటన..!

సినీరంగానికి
ఎన్టీఆర్.. ఏయెన్నార్ ఎలాగో
నాటకానికి వేమూరి గగ్గయ్య
బళ్ళారి రాఘవ అలాగే రెండు కళ్ళు..
వారి ప్రశంసలతో నిండిపోయాయి
నాటి విమర్శకుల ఫైళ్లు..!

బళ్ళారి రాఘవ..
ఈ పేరు అభినయానికే కాదు
అందానికీ ఫేమస్..
చూడచక్కని ఫేస్..
బళ్ళారికి చిన్నప్పుడు
నాటకమంటే మోజు
ఏదో ఒక అభినయం చెయ్యాల్సిందే ప్రతిరోజు..!

సాగదీసే రాగాలను తగ్గించి
తానం..పల్లవి పెంచి..
తానంతో తాను
తన్మయమొంది..
పల్లవితో జనాల్ని శ్రుతి చేసిన
నాటకా’లయకారుడు’..
ఆధునిక నాటక విప్లవకారుడు..!

స్త్రీ పాత్రకు స్త్రీ..
మగువలలో తెగువ నింపి
నాటి నాటకానికి
కొత్త సొగసులద్దిన మేస్త్రీ..
అలా రంగస్థలిని
‘రంగు’స్థలిగా మార్చిన మాలి
అభినయంలో
ఎల్లప్పుడూ మేలి..!

రంగస్థలి నుంచి
న్యాయస్థలి వైపూ ఓ చూపు.
న్యాయవాదిగా నల్లకోటులోనూ
అందమైన ఆ రూపు..
నటుడుగా సాధన..
వకీలుగా వాదన..
అయితే ఈ రెంటిలో
ఏది నీ చాయిస్
అంటే నటనే అంది
గంభీరమైన ఆ వాయిస్..
అలా అందమైన రాఘవతో
నటరంగం చాలాకాలం సుఖీభవ..
మొత్తంగా నటుడుగా
బళ్ళారి చిరంజీవ..చిరంజీవ!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286