పిలుపు వినగ లేవా..!

భక్తతుకారాం..యాభై ఏళ్లు(05.07.1973)
విగ్రహారాధనపై నమ్మకంలేని
అక్కినేని..భక్తుల పాత్ర పోషణలో దిట్ట..
అందునా విగ్రహం కోసమే
పిలుపు వినగ లేవా
నీ గుడికి రావా..
అంటూ ఆలాపన..
అందులో ఆవేదన…!

అభినయ పరాకాష్ట..
భక్తతుకారాం..
ఘంటసాల వారి అద్భుతమైన
రాగాలాపనలో
ఘనాఘన సుందరా
కరుణారసమందిరా
ఈ గీతంతో
శ్రీకారం..
అదే మాస్టారు
గంభీరమైన గొంతుతో
దేవుడి ఉనికినే ప్రశ్నిస్తూ
ఉన్నావా..అసలున్నావా..
ఉంటే కళ్ళు మూసుకున్నావా
ఈ లోకం కుళ్ళు చూడకున్నావా..
ఈ పాటతో శుభం కార్డు..
గరుడ వాహనంపై
తుకారం పయనం..
విఠల విఠల పాండురంగ..
అంగరంగ వైభోగంగా..!

ఈ మధ్యలో ఎంత కత..
ఎన్నెన్ని అపురూప అభినయాలు..
జీవించిన అక్కినేని..
యధావిధిగా శ్రీరంజని..
అద్భుతం అంజలి..
గంభీరంగా శివాజీ..
నాగభూషణం మాత్రమే
చెయ్యగల ముంభాజీ..
సరి సరి వగలు
తెలిసెర గడసరి..
ఇలా మురిపిస్తూ..
పూజకు వేళాయెరా..
రంగ పూజకు వేళాయెరా..
అలా మైమరపిస్తూ
వెండి తెరను మెరిపిస్తూ
నృత్య కాంచనం..
నీ కటాక్షమ్ముల లాలనమ్ములో..
నీ మధురాధర చుంబనమ్ములో..
మధురిమలొలికే
నీ స్తన్యసుధల ఆస్వాదనమ్ములో..
అప్రమేయ దివ్యానందములు
అందించే నీ చల్లని ఒడిలో
హాయిగా నిదురించగలిగే
పాపగా నీ కడుపున జన్మించగలిగే భాగ్యమే
లేదాయె తల్లీ..
కాంచన పశ్చాత్తాపం..
దువ్వుకున్న
ఆ నీలిముంగురులు
దూది పింజలైపోవునులే..
ఇలాంటి ముఖ్యాంశాలెన్నో
ఆ దైవాంశసంభూతుని
కథలో..
ఆదినారాయణుడి
శృతిలో..
మధుసూధనుడి స్మృతిలో..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286