వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దిల్ రాజు, గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన సినిమా బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఈవెంట్‌లో
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘25 ఏళ్ల నుంచి చదలవాడ బ్రదర్స్‌ని చూస్తూనే ఉన్నాం. అనురాధ ప్రొడక్షన్స్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. ఆ టైంలోనే నేను డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించాను. వారితో నాకు పెద్దగా పరిచయం ఉండేది కాదు. దసరా సినిమాను వాళ్లు కొన్నారని తెలిసి వారిని కలవడం జరిగింది. ఆ తరువాత మేం వ్యక్తిగతంగా ఎంతో దగ్గరయ్యాం. శ్రీనివాస్ గారు ఎంతో మంది చిన్న నిర్మాతలకు సాయం చేశారు. ఫైనాన్షియల్‌గా ఎంతో సపోర్ట్ చేస్తారు. ఫిలిం చాంబర్ ఎలెక్షన్స్‌లోనూ నేను అధ్యక్షుడిగా ఉండాలని నా కోసం ఎంతో సాయం చేశారు. నాకు మిగిలిన ఈ టైంలో, ఆ పదవి నుంచి వెళ్లే లోపు రిజల్ట్‌ను చూపించే ప్రయత్నం చేస్తాను. లక్ష్ నటించిన ధీర ట్రైలర్ బాగుంది. ఈ సినిమా ఫిబ్రవరి 2న రాబోతోంది. లక్ష్ కష్టానికి, టీం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి. ప్రేక్షకులు ఈ సినిమాను విజయవంతం చేయాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘నేను ఇన్నేళ్లలో ఏ హీరోని కూడా డేట్స్ అడగలేదు. ఎంతో మంది దర్శకులని నేను పరిచయం చేశాను. ధీర సినిమాతో డైరెక్టర్ విక్రాంత్‌ను పరిచయం చేస్తున్నాను. దర్శకుడు పడ్డ కష్టాన్ని నేను చూశాను. ఆయన పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. తండ్రిగా నేను లక్ష్‌ను చూసి గర్విస్తుంటాను. ఇంతకు మించిన ఆనందం నాకు ఇక రాదు. ఫిబ్రవరి 2న ధీర చిత్రం రాబోతోంది. మార్చిలో నేను వంద కోట్లతో తీసిన రికార్డ్ బ్రేక్ అనే గ్రాఫిక్స్ చిత్రం రాబోతోంది. నేనే ఆ సినిమాను ఐదేళ్ల నుంచి తీస్తున్నా. అది ప్యాన్ వరల్డ్ సినిమా. సునిల్ కుమార్ రెడ్డి గారి కాంబోలో హిందీలోనూ ఓ సినిమాను చేస్తున్నాను. కే.ఎస్.నాగేశ్వరరావు తీసిన నా కనురెప్పవు నువ్వేరా కూడా రెడీగా ఉంది. మా ప్రొడక్షన్స్‌లో ఇప్పుడు పదహారు చిత్రాలు రెడీగా ఉన్నాయి. దిల్ రాజు గారిని ఛాంబర్ అధ్యక్షుడిగా చేయడంలో నా వంతు సాయం చేశాను. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీని ఒక త్రాటిపైకి తీసుకు రావాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ దిల్ రాజు గారు మాత్రం ఏకత్రాటి మీదకు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీకి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఫిల్మ్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా సాయం చేస్తామని అన్నారు. మున్ముందు చిత్ర పరిశ్రమ మరింత ఎత్తుకు వెళ్తుంది. ఇంకా మంచి మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.