రాష్ట్రంలో కూటమి గెలుపునకు అవకాశం

కౌంటింగ్‌ ఏర్పాట్లకు సిద్ధం కండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ: రాష్ట్రంలో కూటమికి అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేట తెల్లం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. వెబెక్స్‌ వీడియో మాధ్యమం ద్వారా శుక్రవారం ఆమె రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, కౌంటింగ్‌ ఏజెంట్లు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌కు 500 ఓట్లకు ఒక్కో టేబుల్‌ ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో అధికారులతో మాట్లాడి స్పష్టత ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో కష్టించి పనిచేసిన కార్య కర్తలు ఇళ్లకు వెళ్లి కృతజ్ఞతలు తెలపాలని నిర్దేశించారు. ఎన్నికల సమయంలో కూటమిలో ఉన్న పార్టీలు ఎంత సమన్వయంతో పనిచేశామో…కౌంటింగ్‌ ప్రక్రి యలో కూడా అంతే సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎన్నికలలో కష్టించి పనిచేశారని వారంద రికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో విస్తారక్‌లు చేసిన కృషిని కూడా ప్రస్తావించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌ జీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.