ఉద్యోగులు, పెన్షనర్లకూ చంద్రబాబు మొండిచేయి

పీఆర్‌సీ ఊసే ఎత్తడం లేదు. మధ్యంతర భృతి లేదు
పెన్షనర్లకు గత బకాయిలు కూడా చెల్లించడం లేదు
హామీ ఇచ్చినట్లు పెన్షనర్ల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
– ఏపీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులకు మేలు చేస్తామని, ఎన్నికల ముందు హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు ఆ హామీల అమలుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీఎన్‌జీవో సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని ప్రచారం చేస్తూ.. గత ప్రభుత్వంపై ఆయన బురద చల్లుతున్నారని తెలిపారు.

తాము అధికారంలోకి వస్తే, ఉద్యోగులకు పీఆర్‌సీ, మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి.. దాదాపు రెండు నెలలు గడుస్తున్నా, ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన తెలిపారు.

అదే గతంలో జగన్‌గారు బాధ్యతలు చేపట్టగానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని గుర్తు చేశారు.

ఇంకా ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయన్న ఆయన.. జీపీఎఫ్, సరెండర్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్‌ రీఇంబర్స్‌మెంట్, ఏపీజీఎల్‌ఐ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్, లాస్ట్‌ పీఆర్సీ ఏరియర్స్‌ ఇవ్వాల్సి ఉందని.. ఇంకా రాష్ట్రంలోని దాదాపు 3.8 లక్షల పెన్షనర్లకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రస్తావించారు. నిజానికి ఇవన్నీ మేనిఫెస్టో అంశాలని చెప్పారు.

వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల ముందు ఉగాది పండగ రోజు ప్రకటించిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే.. దాదాపు 2.5 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేశారని, వారికి రెండు నెలలుగా ఆ వేతనాలు కూడా చెల్లించడం లేదని ఆక్షేపించారు.

కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయాల ఉద్యోగులు 1.20 లక్షల మంది.. పోలీసులు అందరూ కలిపి దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)లో ఉండగా.. దాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్‌ స్కీమ్‌ తీసుకొస్తామని కూడా టీడీపీ కూటమి మాట ఇచ్చి, మేనిఫెస్టోలో పెట్టిందని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.

అదే ఇప్పుడు గ్యారెంటీడ్‌ పెన్షన్‌ పథకం (జీపీఎస్‌)పై గెజిట్‌ నోటిఫికేషన్‌ రాగానే.. మాట మార్చిన ప్రభుత్వం.. అది తమకు తెలియదని, రద్దు చేస్తామని, కారకులపై చర్య తీసుకుంటామని చెప్పడం దారుణమని ఆయన తేల్చి చెప్పారు. అలాగే పాత పెన్షన్‌ పథకం (ఓపీఎస్‌)పై ప్రభుత్వ విధానంపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల భృతి వెంటనే అమలు చేయాలని, ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఔట్‌సోర్సింగ్, అంగన్‌వాడీ ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి, ఇప్పుడు రాజకీయ కక్షతో వారిని వేధిస్తున్నారని.. వారితో పాటు, మెప్మా ఉద్యోగులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లను కూడా వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. తక్షణమే వేధింపులు ఆపి వారికి మేలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

గత ప్రభుత్వం 4 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీస్‌ క్రమబద్థీకరించిందని గుర్తు చేసిన ఏపీఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, మిగిలిన దాదాపు 7 వేల మంది సర్వీస్‌ క్రమబద్థీకరించాలని డిమాండ్‌ చేశారు.