-రైతులు, ప్రజలు అపార్థం చేసుకోవద్దు
-బకాయిలిస్తేనే పనులు చేస్తామంటున్నారు
-జగన్ ఖజానాను ఆరకంగా ఖాళీ చేశాడు
-ఉభయగోదావరి జిల్లాలోనే ధాన్యానికి 9050 కోట్ల రూపాయల బకాయి
-లోకేష్ సమయం ఇచ్చినప్పుడు పాఠశాలల గురించి వివరిస్తా
-పోలవరం, అమరావతి పూర్తి చేయగలిగితే రాష్ట్రం ఊహించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి
-తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించడం అభినందనీయం
-తెలంగాణ నుంచి రావలసిన బకాయి నిధులు వస్తే ఎంతో ఉపయోగకరం
-రాష్ట్రానికి రావలసిన 58% ఆస్తులను మదింపు చేయాలి
-రాష్ట్రంలో ఒకే రోజు 97% మందికి పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది
-సివిల్ సప్లైస్ కార్పొరేషన్ భ్రష్ఠు పట్టించిన ఘనత గత ప్రభుత్వానిదే
-ఉభయగోదావరి జిల్లాలోనే రైతులకే 9050 కోట్ల రూపాయలు బకాయిలు
-సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే
-పెద్ద బ్యాంకులకు కోటి రూపాయలు, చిన్న బ్యాంకులకు 30 నుంచి 40 లక్షల రూపాయలు బకాయిలు పడిన గత ప్రభుత్వం
-ఉండి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులను ఆగస్టు 15వ తేదీ నాటికి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం
– ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు
ఉండి: రాజధాని అమరావతి, జీవనాడి పోలవరాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తే రాష్ట్రం ఊహించిన దానికన్నా ఎక్కువ వేగంగా పురోగతి సాధిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో చక్కటి పరిపాలన వచ్చిందని, ఎన్నారై లు ఎంతోమంది ముందుకు వచ్చి స్థానికంగా పరిశ్రమలను నెలకొల్పుతామని పేర్కొంటున్నారన్నారు .
మంగళవారం ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘు రామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరానికి కేటాయించిన ప్యాకేజీ తో పాటు, అమరావతి అభివృద్ధి కోసం మరికొంత ప్యాకేజీని సాధించగలిగితే రాష్ట్ర పురోగభివృద్ధికి ఒక ఊపు వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈనెల నాలుగు, ఐదవ తేదీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మనకున్న సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో పర్యటించనున్నారని తెలిపారు.
పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి 33 వేల కోట్ల రూపాయలు అవసరమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఊహించిన దాని కన్నా ఎక్కువ విధ్వంసం జరిగిందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలలోని అన్నింటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కువ అమౌంట్ తీసుకు రాగలరన్న ఆశాభావాన్ని రఘు రామ కృష్ణంరాజు వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కావాలని నిర్ణయించుకోవడం ఒక గొప్ప శుభ పరిణామమని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గత దశాబ్ద కాలంగా పరిష్కారం కానీ ఎన్నో సమస్యలకు ఈ సమావేశం ద్వారా పరిష్కారం దొరకాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారని రఘు రామ కృష్ణంరాజు గుర్తు చేశారు.
ఇప్పుడు ఇద్దరూ పదవుల్లో లేరన్న రఘురామ కృష్ణంరాజు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు సమావేశమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆస్తులను దానం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉందని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, లేదు… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమే తెలంగాణకు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉందని అక్కడి నేతలు వాదించారు.
ఏపీఐఐసీ ఇలా ఎన్నో కార్పొరేషన్లకు చెందిన ఆస్తులను 58: 42 శాతం చొప్పున పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నిర్ణయించారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన 58% ఆస్తులను సరిగ్గా మదింపు చేయాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సమస్యకైనా తక్షణ పరిష్కారం చేసే డైనమిక్ లీడర్ అని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, ఒకప్పటి రాజకీయ గురు శిష్యులైన నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రస్తుతం డిఫరెంట్ పొజిషన్లో ఉన్నారన్నారు.
ఢిల్లీలో ఉన్న ఆంధ్రా భవన్ లో ఆస్తుల పంపకం ఇప్పటికీ జరగలేదన్నారు. గతి లేకపోతే ఆంధ్రా భవన్ కు వెళ్లాలనే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని, లేకపోతే బయట ఉండాలనే పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కారం చేస్తారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మన రాష్ట్రానికి తెలంగాణ నుంచి రావలసిన బకాయి నిధులు వస్తే వేడినీళ్ళకు చన్నీళ్లు అన్నట్లుగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఒకప్పటి గురు శిష్యులైన ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక రోడ్డు మ్యాప్ సిద్ధం చేసి, ఆంధ్ర ప్రజలకు మంచి శుభవార్త వినిపిస్తారనే ఆశావాహ దృక్పథంతో ఉన్నట్టు రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
ఒకేరోజు 97% మందికి పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే
ఒకే ఒక్క రోజులో 97% మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కుతుందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. మిగిలిన మూడు శాతం మంది ఊర్లో లేని లబ్ధిదారులు మాత్రమే పింఛన్లను తీసుకోలేదన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీని తట్టుకొని నిలబడి అమలు చేసే వ్యక్తిత్వం నారా చంద్రబాబు నాయుడుదని పేర్కొన్నారు. ప్రజల తరఫున ఒక శాసనసభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నట్లు తెలిపారు.
సివిల్ సప్లై కార్పోరేషన్ భ్రష్ఠు పట్టించింది ఎవరు?
సివిల్ సప్లై కార్పోరేషన్ను భ్రష్ఠు పట్టించిన వ్యక్తి అప్పటి మంత్రా? లేకపోతే ముఖ్యమంత్రా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ కు ఐదు నుంచి 6 వేల కోట్ల రూపాయలు నిధులు ఉంటే చాలునని, కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 36 నుంచి 50 వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారని తెలిపారు. ఆ కార్పొరేషన్ కు అంత రుణం అవసరం లేదని, ఆ రుణంతో కార్పోరేషన్ కు అసలు సంబంధమే లేదన్నారు. ప్రస్తుతం సివిల్ సప్లై కార్పొరేషన్ అకౌంట్ లో డబ్బులు నిల్ బ్యాలెన్స్ గా ఉందని తెలిపారు.
ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 9050 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం బకాయి పడిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సహకార వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సహకార బ్యాంకులలో పెద్ద బ్యాంకుకు కోటి రూపాయలు, చిన్న బ్యాంకులకు 30 నుంచి 40 లక్షల రూపాయల చొప్పున వందల కోట్ల రూపాయలను సహకార బ్యాంకులకు బకాయిలుగా పెట్టారన్నారు.
అసలు ఈ అప్పులు ఏంట్రా బాబు… అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి ఘనాపాఠీ కే బుర్ర తిరిగిపోయే పరిస్థితి నెలకొందన్నారు. జగన్మోహన్ రెడ్డి అంత అడ్డదిడ్డంగా అప్పులను చేశారని విమర్శించారు. రేపు ఒక్క మా జిల్లాలోని 9050 కోట్ల రూపాయల అప్పులను రైతులకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఒకటి అర చిన్న పనులకు కూడా కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్లు మా పాత బకాయిలను ఇప్పించమని కోరుతున్నారు. కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తే, టెండర్లను దాఖలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కొన్ని పనుల కోసం బ్రతిమిలాడి మేమే కొంత మొబలైజేషన్ అడ్వాన్సులను ఇచ్చి…అయ్యా, బాబు అని బ్రతిమిలాడి చేయించుకోవలసిన పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకువెళ్లిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కాస్తా ఆలస్యం అయితే, ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవలసి వస్తుందన్నారు.
జగన్మోహన్ రెడ్డి లాగా కుయుక్తులతో అప్పులు చేసే సామర్థ్యం అందరికీ ఉండదన్నారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లో బకాయిలను చెల్లించడానికి కాస్త ఆలస్యం అయితే రైతులు, ప్రజలు అపార్థం చేసుకోవద్దని కోరారు. గతంలో నెలకొన్న డ్యామేజీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు గత ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టు 15 నాటికి అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి
ఆగస్టు 15వ తేదీ నాటికి ఉండి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మీడియా ద్వారా అభివృద్ధి పనుల గురించి తెలియజేస్తానని హామీ ఇచ్చానని గుర్తు చేశారు.
ఉండి నియోజకవర్గ పరిధిలో డ్రైనేజీ కాలువలలోని గుర్రపు డెక్క, సిల్టు తొలగింపు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగానే సహకారం అందిస్తోందని తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో మంచి నీటి సరఫరా కోసం చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని నిర్ణయించినట్లుగా, దానికి జాయింట్ కలెక్టర్ తో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు కూడా వాయువేగంతో పని చేస్తున్నారని రఘు రామ కృష్ణంరాజు కితాబు ఇచ్చారు.
ఉండి నియోజకవర్గ పరిధిలో ఉన్న 52 ప్రభుత్వ పాఠశాలలలో చక్కటి గ్రీనరీ తో పాటు, కొన్నిచోట్ల స్కూళ్లలో డైనింగ్ హాళ్లు లేవన్నారు. డైనింగ్ హాల్ లేని ఒక పాఠశాలలో జిల్లా జాయింట్ కలెక్టర్, డిఇఓ సహకారంతో గతంలో అదే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులతో 15 లక్షల రూపాయల వ్యయంతో కూడిన పనులను చేయించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో పూలు పూసే మొక్కలతోపాటు, మామిడి చెట్లతోపాటు, మంగళప్రదంగా ఉండేలా పది అడుగుల కొబ్బరి చెట్లను నాటించనున్నట్లు తెలిపారు.
పాఠశాలల ఆవరణలో ఖాళీ రూములు ఉంటే టేబుల్ టెన్నిస్ తో పాటు, చదరంగం వంటి క్రీడలలో విద్యార్థులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. టేబుల్ టెన్నిస్, చదరంగం వంటి క్రీడలలో విద్యార్థులకు శిక్షణను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అవుట్ డోర్ క్రీడలలో భాగంగా వాలీబాల్, కబడ్డీ, ఓపెన్ ఎయిర్ షటిల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు.
ప్రైవేటు పాఠశాలల ఆవరణలో క్రీడాస్థలాలు లేవని, ప్రభుత్వ పాఠశాలలలో మాత్రం విశాలమైన క్రీడా ప్రాంగణాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో అద్భుతమైన విద్యా బోధన చేసే టీచర్లు ఉన్నారన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆయన సమయం ఇచ్చినప్పుడు కలిసి వివరిస్తానని తెలిపారు. విద్యాశాఖ అధికారులు, కలెక్టర్ సహకారంతో ఆగస్టు 15వ తేదీ నాటికి డ్రైనేజీ పనులను పూర్తి చేసినట్లుగానే, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులను కల్పిస్తానని తెలిపారు.
నేను చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంతోమంది నా స్నేహితులు, మా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల ప్రజలు ఆర్థిక సహాయం అందించడం కి ముందుకు వస్తున్నారని తెలిపారు. అమెరికాలో ఉన్నవారు కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెబుతున్నారని, అయితే ప్రస్తుతానికి నా స్నేహితులు, ఉండి నియోజకవర్గ పరిధిలోని గ్రామ ప్రజలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి అనే కార్యక్రమం స్ఫూర్తితో ప్రజలందరి సహకారంతో కాస్ట్ కంట్రోల్ తో రూపాయి కూడా వేస్ట్ చేయకుండా, అనుకున్న కార్యక్రమాలను అనుకున్నట్లుగా పూర్తి చేస్తున్నట్టు రఘురామకృష్ణం రాజు తెలిపారు.
ఎన్ని ఇబ్బందులున్నా ఒకటవ తేదీననే జీతాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే
ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకటవ తేదీననే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని ప్రభుత్వం, ప్రభుత్వమే కాదని భావించిన నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కాకుండా, పెన్షన్ దారులకు పెన్షన్ ను అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించిన ఘనత మా ప్రభుత్వానిదేనిని రఘురామకృష్ణం రాజు తెలిపారు.