కూటి కోసమో..
కోట్ల కోసమో
సినిమాలు తీయలేదు..
సినిమా ఆయన శ్వాస..
నిరంతరం అదే ధ్యాస…
పేరులోనే మూవీని పొదుగుకున్న మొఘల్..
శతాధిక చిత్రాల నిర్మాత
రామానాయుడు..
ఖరీదైన చిత్రాల షోకిల్లారాయుడు…
సురేష్ మూవీస్..
ఈ పేరే గొప్ప చిత్రాలకు చిరునామా..
ప్రతి సినిమాలో
ఓ హంగామా..
రాముడిగా..భీముడిగా పౌరాణిక పాత్రల్లో రాణించిన ఎన్టీవోడిని ఒకే సినిమాలో ఇద్దరుగా రాముడు భీముడుగా
చూపించిన గడసరి…
అక్కినేని కోసం కళాఖండం
ప్రేమనగర్ నే
నిర్మించిన ధీశాలి
శోభనాద్రిని సోగ్గాడిగా ఆవిష్కరించిందీ ఆయనే..
కోవెలమూడి వంశం
తన కోవెలగా…
విడదీయలేని బ్రహ్మముడిగా
చెప్పుకున్న నాయుడు
మూడుసార్లు ఆ కుటుంబం వల్లనే చిక్కుల నుంచి బయటపడి బకాయిపడ్డారేమో
ప్రకాశరావు ప్రేమనగర్
బాపయ్య సోగ్గాడు…
దర్శకేంద్రుడి దేవత..
అందించాయి
ఆయనకు చేయూత..
రూపాయి నోటుపై ఉండే అన్ని భాషల్లో సినిమాలు
తీయాలన్న లక్ష్యం..
అందుకు చాలా భాషల్లో తీసిన గొప్ప
సినిమాలే సాక్ష్యం..
ఎంపిగా పనిచేసినా ఒంటికి సరిపడని రాజకీయం వద్దనుకుని సినిమానే ముద్దనుకుని నచ్చిన చోటే
జనం మెచ్చిన
తాజ్మహల్ కట్టి
మేటి హీరోలందరితో సినిమాలు తీసి తానూ
ఓ కథానాయకుడంత గ్లామర్ సంపాదించుకున్న
కారంచేడు నాయుడు
బ్రతికి చెడలేదు..
చెడీ బ్రతకలేదు..
అంతేకాక ఎందరికో బ్రతుకునిచ్చి
నిర్మాతగానే గాక
మనిషిగానూ నెగ్గాడు..
తీసిన ప్రతి సినిమాలో
ఓ పాత్ర
లాయరు,జడ్జి,డాక్టరు..
ఏదో ఒక కారెక్టరు..
అదో రకం పిచ్చి కాదు
సినిమాలపై గల కచ్చి..
మొత్తానికి మనిషేమో ఫ్యాషన్
సినిమా కడదాకా పాషన్..
-సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286